KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానని భరోసానిచ్చే కేటీఆర్, దేశం కాని దేశంలో గుండెపోటుతో మరణించిన కార్యకర్త మృతదేహాన్ని కుటుంబసభ్యుల చెంతకు చేర్చడంలో అండగా నిలిచారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకర్గంలోని హేమ్లానాయక్ తండాకు చెందిన విస్లావత్ బాబ్యకు బీఆర్ఎస్ పైనా, కేసీఆర్ పైనా అంతులేని అభిమానం. ఓవైపు గులాబీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే బతుకుదెరువు కోసం వ్యవసాయం చేసుకునేవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సాగుబడి కష్టంగా మారడంతో సొంతూర్లో ఉండలేక బతకుదెరువు కోసం సంవత్సరం క్రితం సౌదీ అరేబియాకు వెళ్ళారు. దురదృష్టవశాత్తు గత నెల 27 నాడు తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడే చనిపోయారు.
సౌదీలో ఉండే కఠిన నిబంధనలతో మృతదేహాన్ని సొంతూరుకు రప్పించడంలో కుటుంబసభ్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో విస్లావత్ బాబ్యను కడసారైనా చూసుకోలేమంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలియజేశారు.
భారత విదేశాంగ అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని దౌత్యకార్యలయానికి అందించారు. ఇంతేకాదు తాను విదేశీ పర్యటనలో ఉన్నా కూడా మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. కేటీఆర్ చొరవతో విస్లావత్ బాబ్య మృతదేహం రాత్రి స్వగ్రామానికి చేరడంతో ఇవాళ కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. చివరి చూపు నోచుకుంటామో లేదో అని ఆందోళన ఉన్న తమకు అండగా నిలిచిన కేటీఆర్, అంజయ్య యాదవ్‌లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.