కాంగ్రెస్ సర్కారు చేతగానితనానికి యూరియా యాప్ నిదర్శనం. ఇదివరకు యూరియా షాపుల్లో దొరికేది. ఇప్పుడు యాప్‌లో దొరుకుతదట. షాప్‌లో లేని యూరియా యాప్‌లో ఉంటదంటే నమ్మేదెట్లా? రైతుల లైన్లు కనిపించకుండా, ప్రభుత్వ అసమర్థత బయట ప్రపంచానికి తెలియకుండా యాప్ పేరిట కొత్త డ్రామా మొదలు పెట్టింది. ఈ విధానం ముమ్మాటికీ రైతు వ్యతిరేకమే.
– కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం ఉన్నంతకాలం ప్రజలకు కష్టాలు తప్పవని, రెండేండ్లలో అన్ని వర్గాలను రేవంత్ సర్కారు మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నిధులివ్వకుండా పల్లెలపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఎరువుల కోసం రైతులు ఏనాడూ లైన్లలో నిలబడే దుస్థితి రాలేదని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన వెంటనే అన్నదాతకు యూరియా కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు. ఇప్పటికైనా రైతు సమస్యలపై దృష్టిపెట్టి యూరియా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్లో వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ పరిధిలోని సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరై వారికి శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. అధికార పార్టీ అరాచకాలకు ఎదురొడ్డి నిలిచి గెలిచిన సర్పంచులకు, వారిని గెలిపించిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
సర్పంచులే గ్రామాల్లో కథానాయకులు
మహాత్ముడు చెప్పినట్టు పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని, కొత్తగా గెలిచిన సర్పంచులే గ్రామాల్లో కథనాయకులని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వారు హక్కులను తెలుసుకొని బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టాలని సూచించారు. సర్పంచుల హక్కులు, పంచాయతీలకు వచ్చే నిధులు, విధులు రాజ్యాంగంలో నిర్దేశించారని, ఇందులో ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉండదని స్పష్టంచేశారు. ప్రజల సొమ్ముకు ప్రభుత్వ పెద్దలు ధర్మకర్తలు మాత్రమేని నొక్కిచెప్పారు. పంచాయతీలకు జనాభాకనుగుణంగా కేంద్రం ఆర్థిక సంఘం ద్వారా నేరుగా నిధులిస్తుందని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. కేసీఆర్ పాలనలో పల్లె ప్రగతి ద్వారా ఫైనాన్స్ కమిషన్‌తో సమానంగా నిధులిచ్చేవారని గుర్తుచేశారు. నిన్నమొన్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సర్పంచులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనని మాట్లాడుతున్నాడని, ఎవరి బెదిరింపులకూ భయపడాల్సిన పనిలేదని, ధైర్యంగా ముందుకెళ్లాలని కేటీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు.
పల్లెలకు ప్రజల ద్వారా ఎన్నికైన సర్పంచులే బాస్‌లు. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వను అని ఎవరు బెదిరించినా ఏం కాదు. వాళ్ల చేతిలో ఏమీ ఉండదు. గ్రామసభలో తీర్మానం చేసి సంతకం పెడితేనే ఇల్లు వస్తుంది. లేకుంటే కొట్టుడుపోతుంది. పింఛన్ మంజూరు చేయాలన్నా, కొత్త పథకం ఇవ్వాలన్నా.. మీరు ఒప్పుకొంటేనే అవుతుంది. ఎవరికీ భయపడే అవసరం లేదు. మీ గ్రామానికి మీరే కథానాయకులు.
– కేటీఆర్
కేసీఆర్ పాలనలోనే పల్లెలకు జాతీయ ఖ్యాతి
కేసీఆర్ పాలనలో గ్రామాలు కళకళలాడేవని కేటీఆర్ గుర్తుచేశారు. పల్లె ప్రగతి కింద ప్రతినెలా ఠంఛన్‌గా నిధులు రావడంతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగాయని ఆయన పేర్కొన్నారు. నాడు కేంద్రం సంసద్ ఆదర్శ్ యోజన కింద దేశవ్యాప్తంగా 20 ఉత్తమ పంచాయతీలను ఎంపికచేస్తే అన్నీ తెలంగాణకే దక్కాయని గుర్తుచేశారు. దేశంలో మూడు శాతం జనాభా ఉన్న తెలంగాణ.. జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో 30శాతం గెలుచుకున్నదని కేటీఆర్ తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులివ్వకపోవడంతో పల్లెలన్నీ అరిగోసపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలకు నిధులివ్వడం మరచిన కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీకి మూటలు పంపుతూ కుర్చీలు కాపాడుకొనే పనిలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
యూరియా కోసం రైతుల యుద్ధాలు
కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత యూరియా కోసం రైతాంగం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రైతుబంధు అందని, రుణమాఫీ కాని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర కోపంతో ఉన్నారని చెప్పారు. షాపుల్లో యూరియా ఉంచనోడు.. యాప్‌ల ద్వారా ఇస్తానంటే నమ్మెదెలా అని ప్రశ్నించారు. పాలన చేసేవారికి తెలివి ఉంటే రైతులకు ఎరువుల కష్టాలు ఉండవని చెప్పారు. కేసీఆర్‌కు రైతులపై ప్రేమ ఉన్నది కాబట్టే సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంచారని, కానీ రేవంత్ సర్కారు అసమర్థత వల్ల అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు.
అప్పుల పేరు చెప్పి తప్పించుకుంటున్నరు
అభివృద్ధి చేయడం చేతగాని, చేవచచ్చిన కాంగ్రెస్.. అప్పుల పేరిట అబద్ధాలు చెప్పి తప్పించుకుంటున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఒకరు కేసీఆర్ చేసిన అప్పులు ఆరు లక్షల కోట్లని, మరొకరు 7లక్షల కోట్లని.. ఇంకొకరు 8లక్షల కోట్లని అంటారని.. కానీ ఇందులో ఏది కరెక్టో వారికే తెలియడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాస్తవానికి కేసీఆర్ పదేండ్లలో రూ.2.80 లక్షల కోట్ల అప్పులు చేసి అద్భుతాలు సృష్టించారని చెప్పారు. 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్ల రైతుబంధు జమచేశారని, 15లక్షల మంది ఆడపిల్లల పెండ్లిళ్లకు రూ.లక్ష కట్నం పెట్టారని, తండాలను జీపీలుగా మార్చి పంచాయతీ భవనాలు కట్టించారని గుర్తుచేశారు.
ఊళ్లల్లో ఎల్ఈడీ లైట్లు పెట్టించారని, 16వేల నర్సరీలు అందుబాటులోకి తెచ్చారని. జిల్లాకేంద్రాల్లో అన్ని హంగులతో కలెక్టరేట్లు, సకల సౌకర్యాలతో మెడికల్ కాలేజీలు నిర్మించారని, 24 గంటల కరెంట్, 14లక్షల మంది తల్లులకు కేసీఆర్ కిట్లు ఇవ్వడంతో పాటు బృహత్తరమైన కాళేశ్వరాన్ని ప్రాజెక్టును, అత్యద్భుత రీతిలో యాదాద్రి టెంపుల్ కట్టారని ఉద్ఘాటించారు. కానీ రేవంత్‌రెడ్డి రెండేండ్లలో రూ.2.05 లక్షల కోట్ల అప్పులు తెచ్చి చేసిందేంటి? కనీసం ఒక్క ఇటుకైనా పేర్చారా? ఒక్క ప్రాజెక్టయినా కట్టారా? ఒక్క రోడ్డయినా వేశారా? ఆరు గ్యారెంటీలన్నా అమలు చేశారా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్‌ను తిట్టడం, పదవి కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు పంపడం తప్ప చేసిందేమీలేదని దెప్పిపొడిచారు.
కాంగ్రెస్ దుర్మార్గాలను ఎండగట్టాలి
కొత్తగా గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఊళ్లల్లో వాస్తవాలు చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాలను ఎండగట్టాలని ఆయన సూచించారు. ఏదేమైనా పార్టీ తరఫున గెలిచిన సర్పంచులు ప్రజలతో మమేకమై ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సూచించారు. రెండేండ్లు కష్టాలు ఉన్నా భవిష్యత్ అంతా మనదేనని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్ కాలు బయట పెట్టకుండానే, టీవీల్లో ఒక్క మాట చెప్పకుండానే పల్లెల్లో గులాబీ సైనికులు వీరోచిత పోరాటం చేసి అద్భుతాలు సృష్టించారు. గుర్తులేకున్నా బ్రహ్మాండమైన ఫలితాలు సాధించారు. రేపు గుర్తు వస్తే.. కేసీఆర్ సార్ గుర్తుకొస్తే పరిస్థితి ఎట్లుంటదోనని కాంగ్రెస్ సర్కారు భయపడుతున్నది. అందుకే పరిషత్ ఎన్నికలు పెట్టకుండా పారిపోతున్నది.
– కేటీఆర్
పరిషత్ ఎన్నికలు అనుమానమే
పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ప్రభంజనం చూసి కాంగ్రెస్ పెద్దలు బిత్తరపోతున్నారని, ఇక ఇప్పట్లో పరిషత్ ఎన్నికలు పెట్టడం అనుమానమేనని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అన్ని ఎన్నికల్లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్నీ బీఆర్ఎస్సే గెలుచుకున్నదని గుర్తుచేశారు. కానీ రేవంత్‌రెడ్డి మొన్నటి ప్రెస్మీట్లో 66శాతం తామే గెలిచామని ఒకసారి, తర్వాత పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని చూసి ఓటేయరని స్థానిక నేతలను చూసి ఓటేస్తారంటూ పొంతన లేకుండా రెండు మాటలు మాట్లాడారని ప్రస్తావించారు. రేవంత్‌రెడ్డిలో అపరిచితుడు ఉన్నాడని, రాములా ఒకసారి, రెమోలా మరోసారి వ్యవహరిస్తారని ఎద్దేవా చేశారు. గ్లోబల్ సమ్మిట్‌లో రూ.6లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఓసారి, ఖజానాలో పైసల్లేవని, అప్పుల కోసం ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారని ఇంకోసారి, ఉద్యోగుల జీతాలు పెంచేందుకు పైసల్లేవు నన్ను కోసుకుతింటరా అని మరోసారి.. రోజుకో తీరుగా, పూటకో విధంగా మాట్లాడటం ఆయనకే చెల్లిందని చురకలంటించారు.
ముఖ్యమంత్రి చెప్పినా పల్లెల అభివృద్ధికి నిధులు రావడం లేదన్నది అక్షరసత్యం. ఇది నేను చెప్పడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్ ఉన్నంత కాలం ప్రోగ్రెస్ మరచిపోవుడే. రెండేండ్ల కాలంలో నిధులు రావడం కష్టమే.
– కేటీఆర్