హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : అమృత్ పథకం టెండర్ల అక్రమాలపై కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎంపీలు, మాజీ ఎంపీలతో కలిసి సోమవారం ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. అమృత్ పథకం టెండర్లలో తన బావమరిది సృజన్‌రెడ్డికి లబ్ధి చేకూరేలా సీఎం రేవంత్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అక్రమాలకు సంబంధించి సమగ్ర వివరాలున్న లేఖను మంత్రికి అందజేశారు. కేటీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్‌రావు, మాజీ ఎంపీలు బాల్క సుమన్, మాలోత్ కవిత, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ పథకానికి సంబంధించిన టెండర్ల కేటాయింపులో సృజన్‌రెడ్డికి చెందిన శోధ కన్స్ట్రక్షన్స్కు రూ. 1,137 కోట్ల పనులను అక్రమంగా కట్టబెట్టారని కేంద్రమంత్రికి ఇచ్చిన లేఖలో కేటీఆర్ ఆరోపించారు. టెండర్ల కేటాయింపులో నియమ నిబంధనలు పాటించలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరారు. శోధ కంపెనీకి రూ. వేల కోట్లు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని తెలిపారు. అమృత్ 2.0 టెండర్లలో సృజన్‌రెడ్డి కంపెనీకి కేటాయించిన రూ.1,137 కోట్లతో పాటు అమృత్ 2.0కు కేటాయించిన రూ.8,888.51 కోట్ల టెండర్లపై దర్యాప్తు చేపట్టాలని ఖట్టర్‌కు విజ్ఙప్తి చేశారు. అమృత్ పథకానికి సంబంధించిన టెండర్లను ముఖ్యమంత్రి బావమరిదికి ఇప్పించుకున్నారని, ఇది ముఖ్యమంత్రి పదవిని దుర్వినియోగం చేయడమే అవుతుందని కేటీఆర్ తెలిపారు. రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రతినిధులు తమ విచక్షణాధికారాలను సొంత కుటుంబ సభ్యుల కోసం వినియోగించడం నేరమని పేర్కొన్నారు. అమృత్ టెండర్ల అక్రమ కేటాయింపుల్లో సీఎం అవినీతికి పాల్పడినట్టుగానే భావించాలన్నారు. దీని ప్రకారం ముఖ్యమంత్రి, వారి కుటుంబ సభ్యులు నేరుగా అవినీతిలో భాగమైనట్టే అవుతుందని చెప్పారు. ఈ టెండర్‌ను అక్రమంగా కుటుంబ సభ్యులకు కట్టబెట్టడం ఆర్టికల్ 191(1) ప్రకారం నేరంగా పరిగణించాలని కోరారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆఫీస్ ఆఫ్ప్రాఫిట్ కేసును ఇది పోలి ఉందని వివరించారు. తెలంగాణలోని అమృత్ టెండర్ల అవినీతి కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 9ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 కిందకు వస్తుందని గుర్తుచేశారు.
సీఎం తన బావమరిదికి టెండర్లను కట్టబెట్టడం అధికార దుర్వియోగానికి పాల్పడటం కిందకు వస్తుందని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. గతంలో ఇదే తరహా కేసును సోనియాగాంధీ ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అశోక్ ఖేమ్లా వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా-2024 కేసును ఈ టెండర్ల కేటాయింపు పోలి ఉందని చెప్పారు. ఆ కేసులో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా లబ్ధి పొందినట్టుగానే రేవంత్‌రెడ్డి బావమరిది లబ్ధిపొందారని పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై నమోదైన ముడా కేసు కిందకే ఇది కూడా వస్తుందని తెలిపారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద బిహారీలాల్ డోబ్రే వర్సెస్ రోషన్‌లాల్ డోబ్రే కేసు-1983, శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వర్సెస్ వైరిచర్ల ప్రదీప్కుమార్దేవ్-2005, జయాబచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు-2001, దివ్య ప్రకాశ్ వర్సెస్ కుల్తర్చంద్రాణా-2003 వంటి కేసులు దీనికి వర్తిస్తాయని కేటీఆర్ ఉదహరించారు. 1964లో సుప్రీం కోర్టు కూడా ఇలాంటి కేసులు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకు వస్తాయని తీర్పిచ్చినట్టు తెలిపారు.