KTR | హైదరాబాద్ : తెలంగాణ పోలీసులలోని కొంతమంది రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అలా పని చేస్తున్న పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి అడవిలో ఉన్న పక్షులు, జంతువుల విషయంలో ఏఐ జనరేటెడ్ వీడియోలని ప్రభుత్వం మూర్ఖపు వాదన చేసింది. కానీ నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయి అవి ఏఐ వీడియోలు కాదు జంతువుల ఆర్తనాదాలను తాము విన్నామని స్పష్టం చేశారు.
కంచ గచ్చిబౌలిపై రీట్వీట్లు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టింది. కుక్కల దాడిలో జింకలు చచ్చిపోయిన విజువల్స్ చూసి కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అక్కడ వన్యప్రాణులు లేవు గుంటనక్కలు మాత్రమే ఉన్నాయని చెప్పడం వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనం. మూటల వేట కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న అక్రమాలతో అధికారులు బలి పశువులు అవుతున్నారు. ఇవాళ ఐఏఎస్, ఫారెస్ట్ అధికారులు సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. తెలంగాణ పోలీసులలోని కొంతమంది రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్నారు. ఆ కొంతమందికి కూడా ఇదే హెచ్చరిక. మిమ్మల్ని కూడా వదిలిపెట్టం. మీ మీద కూడా సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇష్టానుసారం అడ్డమైన కేసులు పెడుతున్న పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదు అని కేటీఆర్ హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం కొద్ది రోజులు ఓపికగా ఎదురు చూస్తాం. ఏప్రిల్ 27 తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరకి మా పార్టీ ప్రతినిధులం వెళతాం ఆధారాలను అందిస్తాం. అప్పుడు కూడా స్పందించకపోతే ప్రజాక్షేత్రంలో బీజేపీని ఎండగడతాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుతుంది బీజేపీనే అని ప్రజలకి చెప్తాం. యాజమాన్య హక్కులతో నిమిత్తం లేకుండా అటవీ లక్షణాలు ఉన్న ఏ భూమైనా అడవినే అని సుప్రీంకోర్టు 1996లో చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆర్థిక దోపిడీ, ఈ పర్యావరణ విధ్వంసంపై నరేంద్ర మోడీ స్పందించాలి. లేకుంటే ఈ పాపంలో మోడీకి కూడా వాటా ఉందని అనుకోవాల్సి ఉంటుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఫార్ములా ఈ రేసు విషయంలో నా మీద అడ్డమైన కేసులు పెడితే నేను అధికారులను బలి పశువులుగా చేయలేదు. విధానపర నిర్ణయం నేనే తీసుకున్న ఎలాంటి బాధ్యత అయినా నేనే తీసుకుంటా అని చెప్పా. రాజకీయం అంటే ఇలా చేయాలి మంచి జరిగితే నాది.. చెడు జరిగితే అధికారులదే బాధ్యత అని వాళ్లను బలి పశువులు చేయకూడదు. తనది కాని భూమిని టీఎస్ఐఐసీ తాకట్టు పెట్టి పదివేల కోట్లు అప్పు తీసుకోవడం తప్పు కాదా? యాజమాన్య హక్కులు లేకుండా ఆర్థిక సంస్థలను మోసం చేయడం బ్యాంకులను మోసం చేయడం నేరం కాదా? ఆర్థిక సంస్థలను మోసం చేసిన ముఖ్యమంత్రిని, టీఎస్ఐఐసీని విచారించకపోతే మోడీది తప్పు కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
సెంట్రల్ ఎంపవర్ కమిటీ నివేదిక ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఇందులో కూడా వారికి వాటా ఉందని అనుకోవడం తప్పు అవుతుందా? హడావుడిగా కుట్ర పూరితంగా లోన్ తీసుకోవడానికి ఒక బ్రోకర్ సంస్థకు రూ. 170 కోట్లు చెల్లించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా? మార్కెట్ రేట్ కంటే మూడు శాతం ఎక్కువగా 9.5 శాతం వడ్డీ రేటుకు లోన్ తీసుకువచ్చి బ్రోకర్ సంస్థకు అనుచిత ఆర్థిక లబ్ధి చేకూర్చడంపై విచారణ జరపాల్సిన అవసరం లేదా? ఇందులో మోడీ ప్రభుత్వానికి బాధ్యత లేదా? అన్ని రకాల నిబంధనలను తుంగలో తొక్కి పర్యావరణ హననానికి పాల్పడి భారీ అవినీతికి పాల్పడిన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రిపై వెంటనే కేంద్ర సంస్థలు విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నెలాఖరు వరకు స్పందించి సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో లేదంటే కేంద్ర సంస్థలతో విచారణ జరపాలి. కాంగ్రెస్ హయాంలో సిబీఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవారు. ఈడీని తీసుకొచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు సిబీఐని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తే ఈనాడు ఈడీని బీజేపీ విచ్చలవిడిగా వాడుతుంది అని కేటీఆర్ మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ పార్టీలు రెండు దొందు దొందే. ఈ రెండు ఢిల్లీ పార్టీలు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి అరాచకాలకైనా పాల్పడతాయి. తన రాజకీయ ప్రత్యర్ధులపై ఈడీ కేసులు పెడితే కాంగ్రెస్ స్వాగతిస్తుంది తనదాకా వస్తే మాత్రం ఈడీ మీద ఆరోపణలు చేస్తుంది. ఇదేం రాజకీయం? తెలంగాణ పోలీసులు రేవంత్ ప్రైవేట్ సైన్యంలాగా వ్యవహరిస్తూ ఎక్స్ట్రాలు చేస్తే న్యాయ వ్యవస్థ ద్వారా ఎదుర్కొంటాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.