KTR | హైదరాబాద్ : 420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ జైత్రయాత్రతో ప్రజలు సురుకు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. పొరపాటున మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే సంక్షేమ పథకాలు అమలు కావని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ భవన్లో జరిగిన జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ డివిజన్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రేపటి తెలంగాణ భవిష్యత్తును జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక డిసైడ్ చేస్తుందన్నారు కేటీఆర్. అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్లో గులాబీ జైత్రయాత్రతోనే సురుకుపెట్టాలన్నారు. పొరపాటున కాంగ్రెస్ను గెలిపిస్తే సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం తమకు లేదని ఆ పార్టీ నాయకులు భావిస్తారని చెప్పారు. కారు కావాలో కాంగ్రెస్, బీజేపీ బేకార్ గాల్లు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు.
తెలంగాణ రక్షగా, గొంతుగా ఉన్న కేసీఆర్ను లేకుండా చేయాలన్నదే బిజెపి, కాంగ్రెస్ ఉమ్మడి లక్ష్యం అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తే కాంగ్రెస్ను ఈజీగా ఫుట్ బాల్ ఆడుకోవచ్చని బీజేపీ భావిస్తుందన్నారు. రేవంత్ ప్రభుత్వం చేసిన మోసంతో రాష్ట్రంలో ఏ ఒక్క ఆడబిడ్డ సంతోషంగా లేదన్న కేటీఆర్, గీతక్క ,సీతక్క ,సురేఖ అక్క లు మాత్రమే సంతోషంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ బిజెపిల జాయింట్ వెంచర్ రేవంత్ ప్రభుత్వం అని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీ ఓట్ చోర్ అంటున్న మోడీని, మోసగాడనే అదానీని రేవంత్ వెనుకేసుకొస్తున్నాడని చెప్పారు. రాహుల్ బేకార్ అన్న గుజరాత్ మోడల్ ను ప్రశంసించిన రేవంత్, వేటకుక్క అన్న సిబిఐని కేసీఆర్ మీదకే ప్రయోగించాడని తెలిపారు. దేశంలోని ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం చేసిన వక్ఫ్ సవరణలకు వ్యతిరేకంగా రాజ్యసభలో బీఆర్ఎస్ ఓటు వేసిందన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణలను దేశంలో అందరి కంటే ముందు రేవంత్ ప్రభుత్వమే అమలు చేసిందని గుర్తుచేశారు. ఇలా ఎందుకు చేశారో చెప్పాలని ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ మంత్రులు, నేతలను ముస్లీంలు నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. చరిత్రలో తొలిసారి ముస్లీం మంత్రి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు.