KTR | సిరిసిల్ల రూరల్, మే, 22 : బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు మరింత చేరువయ్యేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మేల్యే కేటీఆర్ తనదైన శైలిలో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాష్ట్ర మంతటా ప్రజా సమస్యలపై గళమెత్తుతూ, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్న కేటీఆర్, అనివార్య కారణాలతో పార్టీ నేతలు, కార్యకర్తల నివాసాల్లో జరిగే వివాహాలకు హాజరు కాకపోవడం వెలితిగా భావిస్తున్నారు. ఈ క్రమంలో వారికి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నూతన దంపతుల ఫొటోలతో మోమోంటో తయారు చేసి, పార్టీ నేతల ద్వారా వారి వివాహాం రోజున అందించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
‘మూడుముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టి మీ జంట పిల్లా పాపలు, అష్ఠైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. నూతన దంపతులకు నా హృదయపూర్వక.. వివాహ మహోత్సవ శుభాకాంక్షలు’
-మీ కేటీఆర్
తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో బుధవారం బీఆర్ఎస్ సీనియర్ నేత వెల్పుల నర్సయ్య కూతురు వివాహం జరగ్గా, నర్సయ్య కూతురు, అల్లుడు ఫొటోతో మోమోంటో తయారు చేసి కేటీఆర్ పంపించారు. ఈ మెమోంటోను మండలాధ్యక్షుడు గజ భీంకార్ రాజన్న వివాహానికి హాజరై అందించారు. కేటీఆర్ పంపిన జ్ఞాపిక అందుకోవడంతో నవ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు తంగళ్లపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నేత రంగు ప్రసాద్ కుమారుడు వివాహానికి, జిల్లెల్లలో మాట్ల
మధు సోదరుడు వివాహానికి జ్ఞాపికలను పంపించగా, అందించామని పార్టీ మండలాధ్యక్షుడు రాజన్న తెలిపారు. సిరిసిల్ల నియోజవర్గంలోని సిరిసిల్ల పట్టణం, తంగళ్లపల్లి, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్‌లోని పార్టీనేతలు, కార్యకర్తలతో పాటు వారి ఇండ్లలో వివాహాలకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.