హైదరాబాద్, జూలై 3 (నమస్తేతెలంగాణ) : ‘లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఏడాది పూర్తి చేసుకున్న రాహుల్‌గాంధీ సాధించినదేమీ లేదు. దేశ ప్రజలను ఉద్ధరించినదేమీ లేదు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. 2014 ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని ఏనాడూ కేంద్రాన్ని నిలదీయకుండా, తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టే బనకచర్లపై మౌనం వహిస్తూ ప్రధాని మోదీతో చేతులు కలిపి తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నారని గురువారం ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. పార్లమెంట్లో ఏ ఒక్కరోజూ కాళేశ్వరం లేదా ప్రాణహిత చేవేళ్లకు జాతీయ హోదా ఇవ్వాలని, బ య్యారం ఉక్కు ఫ్యాక్టరీ మంజూరు చేయాలని అడగలేదని గుర్తుచేశారు. 2015లో మోదీ ప్రభుత్వం విభజన చట్టంలో పెట్టిన ఐటీఐఆర్‌ను రద్దుచేసినా ప్రశ్నించలేదని చెప్పారు. వరంగల్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో రాహుల్ వ్యవహరించిన తీరును తెలంగాణ ప్రజలు ఏనాడు మరిచిపోరని పేర్కొన్నారు.
ఎంత పెరిగినా గొర్రె తోక బెత్తెడే అన్న చందంగా ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల తరుఫున పోరాడటంలో రాహుల్ విఫలయ్యారని విమర్శించారు. గోదావరిలో తెలంగాణ నీటి వాటా ను సీఎం రేవంత్‌రెడ్డి తన గురువైన చంద్రబాబుకు ధారాదత్తం చేస్తుంటే అడ్డుకోవాల్సిన రాహుల్‌గాంధీ మౌనంగా ఉండటంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. బొగ్గు బ్లాక్‌లను కేటాయించకుండా తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి అస్థిత్వాన్ని మాయం చేయాలనుకున్న మోదీ కుట్రలను ఏనాడూ ఎత్తిచూపలేదని ఆక్షేపించా రు. అధికారం కోసం అలవికాని హామీలిచ్చి అమలు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి చతికిలపడితే, రాహుల్‌గాంధీ సమాధానం చెప్పలేక తప్పించుకు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నో ఆశలతో కాంగ్రెస్‌ను గెలిపించిన తెలంగాణ ప్రజల కు రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి రా హుల్‌గాంధీ మోసం చేశారని దుయ్యబట్టారు. ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు శాపంగా మారిందని కేటీఆర్ విమర్శించారు.