KTR | రైతులకు ఒకే ఒక్క కోరిక ఉందని.. ప్రతి ఏడాది కరువు రావాలని వారు కోరుకుంటున్నారని కర్ణాటక మంత్రి శివానంద్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల ప్రభుత్వం నుంచి రుణమాఫీ డిమాండ్ చేయవచ్చని వారు ఆశపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు.
బెళగావిలో జరిగిన ఓ సమావేశంలో రైతు రుణమాఫీలపై మంత్రి శివానంద్ పాటిల్ స్పందించారు. రైతులకు కరెంటు, నీరు ఉచితంగా లభిస్తున్నాయని.. ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రంలో వ్యవసాయరంగ బలోపేతానికి సహకారం అందించారని తెలిపారు. కానీ రైతులు మాత్రం ప్రతి ఏటా కరువు రావాలని కోరుకుంటున్నారని.. దీనివల్ల ప్రభుత్వం నుంచి రుణమాఫీ పొందవచ్చని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. అలా మీరు కోరుకోవడం సరికాదంటూ రైతులకు సలహాలు కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
రైతులపై శివానంద్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా ఖండించారు. శివానంద్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎంతటి దుర్బర పరిస్థితుల్లోనైనా సరే రైతులు కరువును కోరుకోరని స్పష్టం చేశారు.
What sort of Ministers are these? Making absolutely ludicrous statements about the farmers
No Farmer will ever wish for Drought. Even in the worst of conditions, all they wish for is empathy from Government https://t.co/d34DUimZTn
— KTR (@KTRBRS) December 25, 2023
కాగా, శివానంద్ పాటిల్ రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారేమీ కాదు. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అందించే పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచిన తర్వాత రైతుల ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి.