YS Jagan | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మళ్లీ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు జగన్ వ్యక్తిగతంగా గురువారం హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయింపు ఇచ్చింది. గత ఎన్నికల అనంతరం సైతం మినహాయింపును కొనసాగించాలని కోరగా.. ఆయన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరిస్తూ తప్పనిసరిగా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సిందేనని చెప్పింది. దాంతో ఆయన ఉదయం ఏపీలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.
అక్కడి నుంచి సీబీఐ ప్రత్యేక కోర్టుకు వెళ్లి న్యాయమూర్తి రఘురామ్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జగన్ ముగ్గురు న్యాయవాదులతో కోర్టుకి వెళ్లారు. జగన్ కోర్టుకు వస్తున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా హైదరాబాద్ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా.. అక్రమస్తుల కేసులో సీబీఐ 11 చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ కేసులో తమ పేర్లను తొలగించాలంటూ దాఖలైన సుమారు 130 డిశ్చార్జి పిటిషన్లు సైతం ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ కేసులో దాఖలైన ఆరు వేర్వేరు పిటిషన్లపై గురువారం కోర్టు విచారణ చేపట్టింది. మరో వైపు జగన్ కోర్టుకు హాజరైన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా వచ్చిన వెస్సార్సీపీ నేత పేర్ని నాని సహా పలువురు నేతలను పోలీసులు కోర్టు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కోర్టు ప్రధాన గేటు వద్ద అడ్డుకొని.. ప్రాంగణంలోకి అనుమతించలేదు. అదే సమయంలో భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు కోర్టు వద్దకు రాగా వారిని అక్కడి నుంచి దూరంగా పంపించి వేశారు. ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణ చేపడుతున్నది.