KTR | హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాధకుడు, ఉద్యమ సూర్యుడు కేసీఆర్ మీద కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, అన్నీ గుండెల్లో పెట్టుకుంటున్నారని, కాళోజీ చెప్పినట్టుగా సరైన సందర్భంలో ఉప్పుపాతర వేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ‘రెండేండ్ల కాంగ్రెస్ పాలన గురించి మూడు ముకల్లో చెప్పాలంటే డైవర్షన్, సబ్వర్షన్, పర్వర్షన్.. అటెన్షన్ డైవర్ట్ చేయడం, తమ చేతకానితనాన్ని సబ్వర్ట్ చేయడం.. పర్వర్ట్ రాజకీయాలు చేయడం.. ఇదే కాంగ్రెస్ పాలన తీరు’ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో కేసీఆర్ సిట్ విచారణ ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
చట్టాన్ని, భారత పార్లమెంట్ ద్వారా తెచ్చిన బీఎన్ఎస్ఎస్ చట్టాన్ని, అందులో పొందుపరిచిన నిబంధనలను కూడా సిట్ గౌరవించలేదని విమర్శించారు. కానీ, ఒక బాధ్యత గల పార్టీగా, తెలంగాణ ప్రజల గొంతుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా కేసీఆర్ మాత్రం చట్టం, న్యాయం మీద గౌరవంతో పూర్తిస్థాయిలో సిట్ విచారణకు సహకరించారని చెప్పారు. కేసీఆర్ ఏ తప్పూ చేయలేదు కాబట్టి, ఈ రోజు రావాల్సిన అవసరం లేకున్నా, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, గౌరవ ప్రజాప్రతినిధిగా చట్టాన్ని గౌరవించి ఈరోజు సిట్‌కు కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారని చెప్పారు. సిట్ అడిగిన ప్రతి ప్రశ్నకు కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారని తెలిపారు.
రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి, డీజీపీకి, సిట్‌కు నాయకత్వం వహిస్తున్న పెద్దలకు ఫోన్ ట్యాపింగ్‌లో ఎలాంటి తప్పు జరగలేదనే మాట ఈ రోజుతో స్పష్టంగా తేటతెల్లమైందని భావిస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు. ‘నిజానికి ఏ తప్పూ జరగలేదు. మా ప్రభుత్వం ఎన్నడూ తప్పు చేయలేదు. ఎన్నో పుకార్లు, ఎన్నో నీలాపనిందలు, ఎన్నో రకాల కథనాలు, ఎన్నో రకాల అపోహలను ప్రజల్లో సృష్టించే విధంగా రెండేండ్లుగా లీకుల రూపంలో ఇస్తూ, ఇవ్వాళ కాంగ్రెస్ పెద్దలు ఏదైతే పైశాచికానందం పొందుతున్నారో, ఈ రోజుతో దానికి ఫుల్స్టాప్ పెడతారని ఆశిస్తున్నాం’ అని చెప్పారు. ప్రతిసారీ విచారణ ముగియగానే ఏదో లీకుల రూపంలో మీడియాకు పంపుతారని, దయచేసి వాటిని విశ్వసించవద్దని మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తిచేశారు. ‘ఏదైనా ఉంటే స్పష్టంగా స్టేట్మెంట్ ఇవ్వొచ్చు. అధికారులు ముందుకొచ్చి చెప్పొచ్చు’ అని చురకలంటించారు.
కేసీఆర్ మీద బురద చల్లాలనుకుంటే అది సూర్యుడి మీద ఉమ్మేయడమే అవుతుందని, అది తిరిగి వచ్చి తమరి మొహం మీదే పడుతుందని రేవంత్‌రెడ్డిని కేటీఆర్ హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల ఏకాగ్రతను దెబ్బతీయడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కాక్ అండ్ బుల్ స్టోరీ తయారు చేసి కేసీఆర్‌ను విచారణకు పిలిచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘సిట్ విచారణ ఎవరి నాయకత్వంలో జరుగుతున్నదో అర్థం కావడం లేదు. పీసీసీ అధ్యక్షుడి నాయకత్వంలోనా? లేక బీజేపీ నేతృత్వంలోనా? అన్నది తెలియడం లేదు’ అని విమర్శించారు.
‘ఇవాళ రాష్ట్రంలో ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నయ్? నిన్న హైదరాబాద్ నడిబొడ్డున కోఠిలో, సుల్తాన్ బజార్ పరిధిలో పొద్దున 8గంటలకు తుపాకీతో కాల్పులు జరిపి దొంగలు లక్షల రూపాయలు ఎత్తుకుపోయినా పట్టించుకునే నాథుడు లేదు. చివరికి గంజాయి స్మగ్లర్లు, ఒక మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను బండెకించి చంపేస్తే కూడా అడిగే నాథుడు లేడు’ అని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ కుంభమేళాగా జరిగే సమ్మక సారక జాతరలో అధ్వానమైన ఏర్పాట్లున్నాయని భక్తులు తిరగబడుతుంటే, మంత్రుల కార్ల అద్దాలు ధ్వంసం చేస్తుంటే, కనీస ఏర్పాట్లపై సమీక్షించేవాడు లేడు’ అని విమర్శించా రు. గతంలో హిట్ 1, హిట్ 2, హిట్ 3 అని మూడు భాగాలుగా ఒక సినిమా ఇచ్చిందని, అట్లాగే సిట్ 1, సిట్ 2, సిట్ 3 అని చెప్పి టైం పాస్ చేస్తున్నారని మండిపడ్డారు. ‘తెలంగాణ సాధనకు ప్రధాన బాధ్యుడు. ఉద్యమ సూర్యుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ మీద మీరు చేస్తున్న ఈ చిల్లర ప్రయత్నాలను ప్రజ లు గమనిస్తున్నరు. కాళోజీ చెప్పినట్టు సమ యం రాగానే ఉప్పుపాతరేసే బాధ్యత కూడా ప్రజలు తీసుకుంటరు’ అని హెచ్చరించారు.
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇవ్వాళ కేసీఆర్‌ను విచారణకు పిలిచారని కేటీఆర్ మండిపడ్డారు. ‘ఈ రోజు ఫిబ్రవరి ఒకటవ తేదీ. కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ పెట్టే రోజు. 8 మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్‌కు, ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీకి ఉన్నా, తెలంగాణకు గత రెండు బడ్జెట్లలో దకింది సున్నా.. ఈ బడ్జెట్లో కూడా దక్కేది సున్నా అనేది స్పష్టంగా తెలుసు కాబట్టే ఆ అంశం మీదికి, వీళ్ల వైఫల్యం మీదికి, వీళ్ల చేతకానితనం మీదికి, కేంద్రంతో పోరాడి నిధులు తేలేని తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే కేవలం ఫోకస్ షిఫ్ట్ కోసమే ఈ రోజు ఇకడ ఆదివారం పూట, అది కూడా విచారణ అని చెప్పి కేసీఆర్ వెంటబడ్డరు.
కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి అన్యాయం జరిగితే, కేంద్రం కనీసం ఎంగిలి మెతుకులు కూడా మనకు విదిల్చకపోతే, బాధ్యతలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి ఎకడ ఉండాలి? ఏం చేయాలి ఈ రోజు? మంత్రులేమో కేసీఆర్‌ను తిడుతా ఉన్నరు.. ముఖ్యమంత్రి గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నడు’ అని ధ్వజమెతారు. ‘ప్రతి వా రం ఢిల్లీకి పోవాలె.. కాంగ్రెస్‌కు మూటలు సమర్పించుకోవాలె. లేకపోతే ఆయన సీటు పోతది. ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దలను దొంగరాత్రి వెళ్లి కాళ్లు పట్టుకోవాలె. దయచేసి కేసు లు పెట్టకండి, అవసరమైతే భవిష్యత్తులో మీ తో కలిసి నడుస్తా అని కాళ్లు పట్టుకోవాలె.. అదొక్కటే ఆయనకు తెలిసింది’ అని ఎద్దేవా చేశారు. ‘ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే టైం వ చ్చింది. ఇది మీకు మూడో బడ్జెట్. దీని తర్వా త మీకు మిగిలేది ఒక్కటే బడ్జెట్. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ఎట్లాగో ఎలక్షన్ ఇయర్.. చిత్తు కాగితంపై గీకి పారేసిన దానికి ఎంత విలువ ఉంటుందో, లాస్ట్ ఇయర్ మీరు పెట్టిన బడ్జెట్‌కు కూడా అంతే విలువ ఉం టుంది. ఈ రెండు బడ్జెట్లు ఏవైతే మీ చేతుల్లో ఉన్నాయో, అందులో ఇప్పుడు బడ్జెట్ ఎప్పుడుపెడుతారో కానీ ప్రజలు మీ వైపు చూస్తున్నారన్న విష యం గుర్తుపెట్టుకోండి’ అని సూచించారు.
‘సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు కేసీఆర్ సమాధాలు చెప్పారు. కాబట్టి వారు మళ్లీ పిలుస్తారని మేం అనుకోవడం లేదు. మళ్లీ పిలిచినా వెళ్తాం.. మేము ఎలాంటి తప్పూ చేయలేదు’ అని పునరుద్ఘాటించారు. ‘రాహుల్‌గాంధీని, సోనియాగాంధీని ఈడీ విచారణకు పిలిస్తే రాజ్‌భవన్ ఎదుట ముఖ్యమంత్రి, మీరు ఎందుకు పోయి ధర్నాలు చేశారు?’ అని టీపీసీసీ చీఫ్‌ను నిలదీశారు. అక్రమ కేసులో తమ నాయకుడిని పిలిస్తే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి నిరసన తెలిపారని తెలిపారు. ‘ఉదయం నుంచి మా కార్యకర్తలు గ్రామగ్రామాన గర్జించారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా గొప్పగా పోరాడారు. సోషల్ మీడియాలో వారియర్లు, గ్రామ గ్రామాన కార్యకర్తలు, ప్రతి పట్టణంలో కదం తొకి మోటర్ సైకిల్ ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలతో హోరెత్తించిన ప్రతి ఒకరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు.
‘కేసీఆర్ అంటే తెలంగాణ చరిత్ర.. ఆ చరిత్రలో మీరు కనీసం చిన్న ఫుట్‌నోట్ కూడా కాలేరు’ అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ విమర్శించారు. ‘ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తి కేసీఆర్. తెలంగాణ కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో క్షణ కాలం కూడా పకకు తప్పుకోని ధీశాలి. దుష్టశక్తులకు వ్యతిరేకంగా పర్వతంలా నిలబడిన మనిషి కేసీఆర్. మీ చిల్లర రాజకీయాలు, నీచమైన ఎత్తుగడలకు ఆయన ఈరోజు వణికిపోయే వ్యక్తి కాదు. మూర్ఖులు చరిత్రను సృ ష్టించడం పకన పెడితే.. కనీసం చరిత్రను అర్థం కూడా చేసుకోలేరు. ఆ యన పేరు ఎత్తే స్థాయి కూడా మీకు లే దు. మీరు ఎంత విషం చిమ్మినా.. ఆయనను ఎవరూ ఏమీ చేయలేరు’ అని ఆదివారం ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.
‘మీరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, అక్రమ కేసులతో వేధించినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటం’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. ఇవ్వాళ రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉంటే మీరు గాలి మాటలు, గాలిలో విహారాలు, సిట్ల పేరిట కాలక్షేపాలు చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి నిధులు కేటాయించకపోయినా కాంగ్రెస్ మంత్రులు ఎవరూ మాట్లాడక పోవడం ఏమిటని మండిడ్డారు. రాష్ట్ర ప్రజలకిచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలు, వాటి అమలును ఎప్పటినుంచి మొదలుపెడతారని ప్రశ్నించారు.
‘ఈ బడ్జెట్లో ఎన్ని కేటాయింపులు చేస్తారు? మీరు ప్రజలకు ఎంత బాకీ పడ్డారో బాకీ కార్డుల ద్వారా ప్రతి ఇంటికీ పోయి మున్సిపల్ ఎన్నికల్లో వివరంగా చెప్తం’ అని పేర్కొన్నారు. ‘ఒక్కో రైతుకు మీరు 80 వేల రూపాయలు బాకీ పడ్డారు. ఒక్కో అవ్వకు, తాతకు మీరు 52 వేల చొప్పున బాకీ ఉన్నరు. రైతులకు, మహిళలకు రెండున్నర వేల చొప్పున 60 వేలు బాకీ ఉన్నరు. ఇవన్నీ ప్రజలకు చెప్తాం’ అని హెచ్చరించారు. ‘ఇవ్వాళ అమెరికాలో సంచరిస్తున్నారు కదా? ఎవరబ్బ సొమ్ము ఇదంతా? ప్రజల సొత్తు కాదా? మీ సోకుల కోసం, మీ విలాసాల కోసం మీరు ఈరోజు చేస్తున్న ఈ కాలక్షేపం.. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాతపెడుతరు’ అని హెచ్చరించారు.