మహబూబ్నగర్ : అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా రాష్ట్రంలో ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లు, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలిచిన సర్పంచ్లు, వార్డు సభ్యులకు అభినందనలు తెలియజేశారు. పోరాడి ఓడిన వారిని కూడా అభినందించారు.
ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయకపోవడంపై మాట్లాడారు. ‘గతంలో నేను మున్సిపల్ మంత్రిగా పనిచేసిన. 2014 కంటే ముందు మహబూబ్ నగర్ పట్టణం ఎట్లుండే ఇయ్యాల ఎట్లున్నది.. అనేది చూస్తున్న మీ అందరికీ తెలుసు. ఒక్క మహబూబ్నగరే కాదు, నారాయణపేట, వనపర్తి, నాగర్కర్నూల్, గద్వాల్ ఇలా ఈ జిల్లాలో ఏ పట్టణం చూసినా ఎట్ల అభివృద్ది చెందినయో మీరందరూ చూసిండ్రు. ఈ పట్టణాలు 2014కు ముందు ఎట్టుండె, ఇప్పుడు ఎట్టున్నయో మీరు గమనించండి. కేసీఆర్ నాయకత్వంలో ఒక్కటి రెండు కాదు, అన్ని పట్టణాలను అభివృద్ధి చేసుకున్నం. అన్ని పల్లెలను అభివృద్ధి చేసుకున్నం’ అని చెప్పారు.
‘పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల కింద.. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినం. సరే అసెంబ్లీ ఎన్నికల్లో మనం కొద్ది తేడాతో ఓడిపోయినం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయ్యింది. ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఒక్క పని కూడా కొత్తగా చేసింది లేదు. పల్లెల్లో కేసీఆర్ నాయకత్వంలో ట్రాక్టర్లు పెట్టి, నీటి ట్యాంకర్లు పెట్టి, చెట్లు పెట్టి, ఇంటింటికి నల్లా పెట్టి, ప్రతి పల్లె వీధుల్లో స్ట్రీట్ లైట్లు పెట్టి, డంపింగ్ యార్డులు పెట్టి, వైకుంఠధామాలు కట్టి, పల్లె ప్రకృతి వనాలు కట్టి బ్రహ్మాండమైన అభివృద్ధిని కేసీఆర్ చూపించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ట్యాంకర్లలో నీళ్లు లేవు, ట్రాక్టర్లో డీజిల్ లేదు. వీధుల్లో లైట్లు వెలుగుతలేవ్’ అని విమర్శించారు.