హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తేతెలంగాణ): ‘ఓ చోట చెప్పులు.. మరోచోట ఆధార్‌కార్డులు.. ఇంకోచోట పట్టాదార్ పాస్‌బుక్కులు.. ఎండ లేదు.. వాన లేదు, పగలు లేదు.. రాత్రి లేదు, తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా ఇవే లైన్లు..’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవేదన వ్యక్తంచేశారు. యూరియా కోసం కోడి కూయకముందే రైతన్న ఎరువుల దుకాణం ముందు క్యూలో నిల్చునే దుస్థితి వచ్చిందని బుధవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు చేతగానితనంతో అన్నదాతల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్క ఎరువు బస్తా కోసం పడిగాపులు కాసే పరిస్థితులు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడైనా చూశామా? అన్నదాతకు ఎందుకీ దైన్యం? అని ప్రశ్నించారు. మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. చెప్పినట్టే మళ్లీ ఆనాటి రోజులు తెచ్చిందని ఎద్దేవా చేశారు. ముందుచూపు కరువైన రేవంత్ సర్కారు.. అన్నదాతను అరిగోస పెడుతున్నదని విమర్శించారు. కేటీఆర్ తన ట్వీట్‌కు వివిధ పత్రికల్లో ప్రచురితమైన రైతుల క్యూలైన్ల ఫొటోలను జత చేశారు.