హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో రాష్ట్ర ప్రభుత్వమే విషం పెడుతుంటే, విద్యార్థులు ఇంకెవరితో చెప్పుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి తన పిల్లలకు ఇలాంటి దుర్భర పరిస్థితి ఉంటే ఆయన చూస్తూ ఊరుకుంటారా? లేక తగిన చర్యలు తీసుకుంటారా సమాధానం చెప్పాలని మంగళవారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై, విద్యార్థుల మరణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఏడాదిలో వెయ్యికిపైగా ఫుడ్ పాయిజన్ ఘటనలు నమోదై, వేలమంది విద్యార్థులు అనారోగ్యానికి గురై, 100 మందికి పైగా విద్యార్థులు మరణించడానికి రాష్ట్ర ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే కారణమని ధ్వజమెత్తారు. గురుకుల విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్, విద్యార్థుల మరణాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
విషాద ఘటనలపై సమీక్షించని సీఎం
గురుకుల విద్యా సంస్థల్లో ఇన్ని విషాద ఘటనలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి రేవంత్‌రెడ్డి ఒక్క సమీక్ష కూడా నిర్వహించకపోవడం ఆయన నియంతృత్వ, అమానవీయ పాలనకు నిలువెత్తు నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు ఒకట్రెండు జరిగితే పొరపాటు అనుకోవచ్చు గాని, వెయ్యి సార్లు వరుసగా జరిగి విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్రలో ఉండటం నేరపూరిత నిర్లక్ష్యం కాక మరేమిటని తూర్పారబట్టారు. ఫుడ్ పాయిజన్, విద్యార్థుల మరణాలపై ముఖ్యమంత్రిగా కాకుండా, కనీసం ఒక తండ్రిగానైనా రేవంత్‌రెడ్డి ఆలోచన చేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ అంశంపై రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా దృష్టి పెట్టాలని, ఇద్దరు పిల్లల తండ్రిగా తాను కోరుతున్నట్టు పేర్కొన్నారు.
విద్యార్థుల మరణాలకు ఎవరెవరిని ఉరి తీస్తారో?
సీఎం గతంలో అన్నట్టుగా విద్యార్థుల మరణాలకు ఎవరిని బాధ్యులు చేస్తారు? ఎవరెవరిని ఉరితీస్తారో సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గురుకుల విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్, విద్యార్థుల మరణాల అంశాన్ని గతంలో బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లామని గుర్తుచేశారు. తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ప్రతిసారీ మంత్రులు కంటి తుడుపు చర్యలతో పకదారి పట్టించే ప్రయత్నానికి ఒడిగట్టారని మండిపడ్డారు. ఫుడ్‌పాయిజన్‌తో విద్యార్థులు చనిపోతుంటే, సర్కార్ మాత్రం దాన్ని రాజకీయం చేసి, ఆ సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడి గురుకుల హాస్టళ్లలో చోటుచేసుకుంటున్న దారుణాలకు అడ్డుకట్టవేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ తరఫున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.