ప్రాజెక్టులు కట్టాక రిపేర్లు వస్తుంటయన్న విషయాన్ని మరిచి కేవలం మేడిగడ్డ బరాజ్‌లోని రెండు పిల్లర్లను బూచిగా చూపి కమిషన్ల పేరిట కక్షగట్టడం అత్యంత దుర్మార్గం. మొన్న జూరాల ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు.. నిన్న మంజీరా బరాజ్‌కు పొంచి ఉన్న ముప్పు.. నేడు సింగూరు డ్యామ్‌కు మోగిన డేంజర్ బెల్స్.. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మరమ్మతులు చేయాల్సిందే.
-కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రజల సాగు, తాగునీటి గోస తీర్చే ఏ ప్రాజెక్టునైనా కంటికి రెప్పలా కాపాడాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ఏదైనా ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాల్సిన పరిస్థితులు వస్తే యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇతర ప్రాజెక్టులకు రిపేర్లు వస్తే తప్పులేదనట్టు పోజులు కొట్టే కాంగ్రెస్, బీజేపీ నేతలు కాళేశ్వరంపై మాత్రం బురదజల్లుతున్నారని, ఇది వాళ్ల దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
4 కోట్ల ప్రజలు ఊరుకోరు
‘జూరాల ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడంతోపాటు బలహీనంగా ఉన్న ఇతర గేట్ల రోప్‌లను అలాగే గాలికొదిలేస్తే ప్రాజెక్టు నిలుస్తుందా? హైదరాబాద్ జంటనగరాలకు మంచినీరు అందించే మంజీరా బరాజ్‌కు ప్రమాదం పొంచి ఉన్నదని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నిపుణుల బృందం చేసిన హెచ్చరికపై సోయిలేకపోతే మంజీరాకు మనుగడ ఉంటుందా? ఇవాళ సింగూరు డ్యామ్‌కు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయని ఎన్డీఎస్ఏ చేసిన హెచ్చరికను కూడా అలాగే పెడచెవిన పెట్టి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తారా?’ అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘జూరాల, మంజీర, సింగూరుకు ఒక న్యాయం.. మేడిగడ్డ బరాజ్‌కు మాత్రం మరో న్యాయం అంటే నాలుగు కోట్ల ప్రజలు ఊరుకోబోరు’ అని హెచ్చరించారు. అన్ని ప్రాజెక్టులకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేయాల్సిందేనని, ప్రజల సాగు, తాగునీటి గోస తీర్చే ఏ ప్రాజెక్టునైనా కంటికి రెప్పలా కాపాడాల్సిందేనని స్పష్టంచేశారు.
పనికిమాలిన ప్రభుత్వం
తాము మూసీపై తలపెట్టిన ఒక్క వంతెనను కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా పూర్తిచేయలేకపోయిందని కేటీఆర్ విమర్శించారు. ‘ఇది పనికిమాలిన ప్రభుత్వం, పనికిమాలిన పాలన’ అని మండిపడ్డారు. మూసీ నదిపై వంతెనల నిర్మాణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 545 కోట్లు మంజూరు చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించిందని, మూసీ నదిపై వంతెనల నిర్మాణం ద్వారా హైదరాబాద్‌వాసుల రాకపోకలను సులభతరం చేయడానికి 2022, జనవరిలో 15 వంతెనల నిర్మాణాలను మొదలుపెట్టిందని తెలిపారు. ఈ వంతెనల పొడవు సుమారు 150-200 మీటర్లు అని తెలిపారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఆ పనున్నీ పెండింగ్‌లో పడ్డాయని, మూసీపై ఒక వంతెన కూడా పూర్తి కాలేదని ఎండగట్టారు.
కేటీఆర్‌కు సింగపూర్ ఆహ్వానం
సింగపూర్‌లోని ప్రముఖ తెలుగు సాంస్కృతిక సంస్థ ‘సింగపూర్ తెలుగు సమాజం’ తమ స్వర్ణోత్సవాలకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించింది. ఈ నెల 31న మెరీ నా బే సాండ్స్ సింగపూర్ వేదికగా నిర్వహించే వేడుకలకు రావాలని తెలుగు సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి లేఖ రాశారు. తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం సింగపూర్ తెలుగు సమాజం కృషిచేస్తున్నదని లేఖలో పేర్కొన్నారు. సింగపూర్‌లో ఉండే తెలుగు ప్రజల మధ్య ఐక్యత పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని, తెలంగాణ సాంస్కృతిక, రాజకీయ వారసత్వానికి ప్రతినిధి అయిన కేటీఆర్ రాక సింగపూర్ తెలుగు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. స్వర్ణోత్సవాల్లో పాల్గొని తమ సంస్థకు గౌరవం ఇవ్వాల్సిందిగా కేటీఆర్‌ను కోరారు.
నేడు తెలంగాణ భవన్లో పంద్రాగస్టు వేడుకలు ; పతాకావిష్కరణ చేయనున్న కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో శుక్రవారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉదయం 9:30 గంటలకు జాతీయ పతాకాన్ని, అనంతరం 10:30 గంటలకు కేసీఆర్‌పై మహేంద్ర తోటకూరి రాసిన ‘ప్రజాయోధుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. మూసీ నదిపై వంతెనల నిర్మాణం హైదరాబాద్ వాసుల చిరకాల కల. ఆ కలను నిజం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 545 కోట్లు మంజూరు చేసి, పనులు ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ ఎకడ వేసిన గొంగళి అకడే అన్నట్టుగా మారినయి. మూసీపై ఒక వంతెనా పూర్తి కాలే. నిర్లక్ష్యం, అసమర్థత, చేతగానితనం..ఇవన్నీ కాంగ్రెస్ పాలనకు నిదర్శనం. -కేటీఆర్