KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. గ్యారెంటీలను గాలికొదిలేసి.. శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. ప్రచారంలో హామీలను ఊదరగొట్టి.. అధికారంలోకి రాగానే మభ్యపెడతారా..? కుంటిసాకులతో పథకాలకు పాతరేస్తారా..? అని ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా ప్రశ్నించారు. ఏరు దాటినంక తెప్ప తగలెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నరా అని మండిపడ్డారు. గద్దెనెక్కినంక వాగ్దానాలను గంగలో కలపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నరా..? అని ప్రశ్నించారు. శ్వేత పత్రాల తమాషాలు.. పవర్ పాయింట్ షోలు దేనికోసమని నిలదీశారు. అప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి అధికార పీఠం దక్కగానే.. మొండిచేయి చూపించడానికి తొండి వేషాలు వేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తొమ్మిదిన్నరేళ్ల తమ ప్రగతి ప్రస్థానం.. తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం అని కేటీఆర్ తెలిపారు. శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీ ఆస్తులు.. అప్పులు.. ఆదాయ వ్యయాల శ్వేత పత్రాలే కదా అని అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో తాము విడుదల చేసిన ప్రతి ప్రగతి నివేదిక… ఓ స్వచ్ఛమైన శ్వేతపత్రం అని స్పష్టం చేశారు. ఆడిట్ రిపోర్ట్లు.. ఆర్బీఐ నివేదికలు ప్రతిపైసాకు లెక్కా పత్రం చూపించి ఆర్థిక స్థితిని ఆవిష్కరించాయి కదా గుర్తుచేశారు. ప్రతి రంగంలో పదేండ్ల ప్రగతి నివేదికలు ప్రచురించి.. ప్రజల ముందు ఉంచామని.. తాము దాచిందేమీ లేదని.. వాళ్లు శోధించి.. సాధించేది ఏమీ ఉండదన్నారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరని ఎద్దేవా చేశారు.
గ్యారెంటీలను గాలికొదిలేసి…
శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదు..ప్రచారంలో హామీలను ఊదరగొట్టి..
అధికారంలోకి రాగానే మభ్యపెడతారా..?
కుంటిసాకులతో పథకాలకు పాతరేస్తారా..??ఏరు దాటినంక తెప్ప తగలెయ్యడానికి
ఏర్పాట్లు చేసుకుంటున్నరా..?గద్దెనెక్కినంక వాగ్దానాలను గంగలో కలపడానికి
రంగం…— KTR (@KTRBRS) December 19, 2023
మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దివాలాకోరు స్టొరీలు చెప్పి.. తప్పించుకోవాలని చూస్తారా అని కేటీఆర్ నిలదీశారు. అబద్ధాలు ..అసత్యాలు చెప్పి గెలిచినంత ఈజీ కాదు నిబద్ధతతో మాట నిలబెట్టుకోవడమని స్పష్టం చేశారు. చిత్తశుద్ధి లేనప్పుడు.. తప్పించుకునే తప్పుదోవ పట్టించే వంచన బుద్ధిని ప్రదర్శించడం మీకు అలవాటే అని ఎద్దేవా చేశారు. అప్పుల ముచ్చట్లు చెప్పి ఆరు గ్యారెంటీలను నీరుగార్చాలన్నది అసలు ప్లాన్ అని అన్నారు. అంచనాలు.. అవగాహన లేకుండానే అర్రాస్ పాటలు పాడినారా అని నిలదీశారు. వందరోజుల్లో నెరవేరుస్తామని చెప్పిన హామీలను ఎట్లా బొందపెట్టాలన్న ఎత్తుగడల్లో భాగమే ఈ నాటకాలు అని విమర్శించారు. మీరు ఎన్ని కథలు చెప్పినా.. మీరు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చేదాకా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
ప్రజలు అడుగుతోంది.. శ్వేతపత్రాలు కాదని.. గాలి మాటల గ్యారెంటీల సంగతి ఏంటని కేటీఆర్ నిలదీశారు. కాకిలెక్కలతో కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తే.. తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం ఖాయమని అన్నారు. హామీలు అమలు చేయలేకపోతే.. అధికార కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ గ్యారెంటీ అని జోస్యం చెప్పారు.