KTR : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఏండ్లకేండ్లు ఈ ప్రాంతాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అడుగడుగున అన్యాయమే చేశాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని విమర్శించారు. వీళ్లలో ఒకరు మంచోళ్లు, మిగతావాళ్లు లంగలు అన్నట్టు కాదని, ఇద్దరూ ఇద్దరేనని వ్యాఖ్యానించారు. బీజేపీ 1998 నుంచి తెలంగాణను మోసం చేస్తోందని, ఇక కాంగ్రెస్ పార్టీ మోసాల గురించి చెప్పనక్కరలేదని, ఏండ్లుగా మోసమేనని అన్నారు.
2014 ఎన్నికల సందర్భంగా మోదీ ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తానని అన్నారని, మరి మీ ఖాతాల్లోకి రూ.15 లక్షలు వచ్చినయా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. రూ.15 లక్షలు కాదు కదా.. కనీసం 15 రూపాయలు ఇయ్యకపోయినా కరీంనగర్లో బీజేపీకి ఓట్లు మాత్రం బాగనే గుద్దుతున్నరని వ్యాఖ్యానించారు. అంతేగాక ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తానని మోదీ చెప్పిండని, మరి 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు రావాలని, మరె వచ్చినయా అని ప్రశ్నించారు. అక్కడ బీజేపీ మోసం, ఇక్కడ కాంగ్రెస్ మోసం అని విమర్శించారు.
అక్కడ బీజేపీ.. ఖాతాల్లో నగదు, ఉద్యోగాల పేరు చెప్పి మోసం చేసిందని, ఇక్కడ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, 420 అబద్దపు హామీలు, చేతగాని మాటలతో మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. తాను చెప్పిన నక్క కథ కాంగ్రెస్ గురించో, బీజేపీ గురించో కాదని, కాంగ్రెస్, బీజేపీ ఇద్దరి గురించని అన్నారు. కథలో నక్క రంగు బయటపడినట్టే వీళ్ల అసలు రంగు కూడా బయటపడే రోజు వస్తదని వ్యాఖ్యానించారు. బీజేపీ మోసం నిన్న ఇయ్యాల మొదలైంది కాదని చెప్పారు.
కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే.. ‘1998లో ఒక ఓటు వేయండి రెండు రాష్ట్రాలు ఇస్తమని బీజేపీ కాకినాడలో ఒక తీర్మానం చేసింది. మరి బీజేపీ రాష్ట్రం ఇచ్చిందా..? ఇయ్యలే. కాకినాడ తీర్మానాన్ని కాకి ఎత్తుకుపోయింది. బీజేపీ అయ్యాల్నే అట్ల మోసం చేసింది. ఇగ కాంగ్రెస్ మోసం గురించి చెప్పనక్కరలేదు. ఆ పార్టీ మొదటి నుంచి తెలంగాణను మోసం చేస్తూనే వచ్చింది. కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తమని చెప్పిన ఓట్లేసిండ్రు. ఇందిరమ్మ రాజ్యంల ఎంత అరాచకం జరిగిందో కొందరు మర్చిపోయినట్లున్నరు.’ అని వ్యాఖ్యానించారు.