KTR | హైదరాబాద్ : కంచె గచ్చిబౌలి అయినా, పాలమూరు ప్రాజెక్ట్ అయినా.. మీ తప్పులు ఎత్తి చూపిస్తే కోర్టు తీర్పులను అపహాస్యం చేస్తారా? అని టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో పూర్తిగా విస్మయం చెందానని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేయడం సుప్రీంకోర్టును మాత్రమే కాదు, భారత రాజ్యాంగాన్ని కూడా కించపరచడం అని కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టు తీర్పులపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడం దురదృష్టకరం అని ధ్వజమెత్తారు.
మీ నాయకుడు రాహుల్ గాంధీ న్యాయ యాత్రలు చేస్తుంటారు.. మీ కాంగ్రెస్ నాయకులు మాత్రం న్యాయాన్ని, కోర్టులను, తీర్పులనూ అపహాస్యం చేస్తుంటారు. మీకు అనుకూలం కాకుంటే అది నిజం కాదు! మీకు నచ్చకపోతే అది న్యాయం కాదు? నేషనల్ హెరాల్డ్ కేసులో రేపు ఒకవేళ కోర్టులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు అనుకూలంగా తీర్పు ఇస్తే.. తప్పు అని చెప్తారా? కంచె గచ్చిబౌలి అయినా, పాలమూరు ప్రాజెక్ట్ అయినా – మీ తప్పులు ఎత్తి చూపిస్తే కోర్టు తీర్పులను అపహాస్యం చేస్తారా? అని మహేశ్ కుమార్ గౌడ్‌ను కేటీఆర్ ప్రశ్నించారు.