KTR | రాజన్న సిరిసిల్ల : కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనీశ్వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా కేటీఆర్ దేవునిగుట్ట తండాలో రైతులను కలిశారు. ఈ సందర్భంగా సాగునీరు లేక తాము పడుతున్న ఇబ్బందులను కేటీఆర్‌కు రైతులు వివరించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకువచ్చి మల్కపేట రిజర్వాయర్‌లో పోస్తే దేవునిగుట్ట తండాలోని రైతులు వ్యవసాయం చేసేవారు. కేసీఆర్ మీద ఉన్న కోపం, ద్వేషంతో మేడిగడ్డలో జరిగిన కుట్రపూరిత ప్రమాదాన్ని సాకుగా చూపించడంతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి. సిరిసిల్ల ప్రాంతంలోని చాలామంది రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాళేశ్వరం నీళ్లు రాక తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లోనూ వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడిందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు. మేడిగడ్డ పర్రెను రిపేర్ చేసి నీళ్లు ఇవ్వవచ్చు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు మండు వేసవిలో ఎర్రటి ఎండల్లో కూడా సిరిసిల్ల జిల్లాలోని అప్పర్ మానేరు ముత్తడి దుంకింది. మిడ్ మానేరు, అప్పర్ మానేరు నింపడంతో ఎర్రటి ఎండల్లో కూడా వాగులు చెరువులను నింపి రైతులను కాపాడుకున్నం. సిరిసిల్ల జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. చూస్తూ ఊరుకోం. 48 గంటల్లో నీళ్లను వదిలి పెట్టకపోతే మంత్రి ఛాంబర్ ముందట ధర్నా చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని కేటీఆర్ హెచ్చరించారు.
కేసీఆర్ మీద కోపం ఉంటే రాజకీయంగా తలపడాలి కానీ రైతులను గోస పెట్టొద్దు. ఇప్పటికే 450 మంది రైతులను రేవంత్ రెడ్డి పొట్టన పెట్టుకున్నాడు. కాంగ్రెస్ చెప్పిన రైతు డిక్లరేషన్‌లో ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదు. రైతుబంధును కూడా వేయడం లేదు. ఈ ప్రభుత్వానికి కరెంటు ఇచ్చే తెలివి లేదు నీళ్లు ఇచ్చే తెలివి లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నీళ్లేమో పాతాళంలోకి పోయాయి.. నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి.. నియామకాలు ఏమో గాల్లో కలిసిపోయాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతులను కాపాడుకోవడానికి వెంటనే నీళ్లను విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ప్రస్తుతం మిడ్ మానేరులో 16 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఒక్క టీఎంసీ నీళ్లను మల్కపేట రిజర్వాయర్‌కు వదిలిపెట్టాలని కోరుతున్నాము. తాగునీటి అవసరాలకు మూడు టీఎంసీలు మాత్రమే కావాలి. తాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాదు. ఇంకా 13 టీఎంసీల నీళ్లు మిడ్ మానేరులో ఉంటాయి. రైతులకు నీళ్లు విడుదల చేయకపోతే అన్నదాతలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రైతులు గుండె ధైర్యంతో ఉండి వ్యవసాయాన్ని కొనసాగించాలని కేటీఆర్ సూచించారు.