KTR | రాజన్న సిరిసిల్ల : గోదావరి నీళ్లు రేవంత్ రెడ్డి అబ్బ సొత్తు, ఆయన తాత జాగీరు కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. సిరిసిల్లలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు కమిటీ వేద్దామని అనగానే తల ఊపడానికి గోదావరి నీళ్లు రేవంత్ రెడ్డి జాగీరు కాదు. మేము కాళేశ్వరం కడుతుంటే అడ్డుకోవడానికి ఇదే చంద్రబాబు నాయుడు లేఖలు రాశాడు. గోదావరి, కృష్ణా జలాల్లో మా వాటా తేల్చి, మా నీళ్లు మేము తీసుకున్నాక మిగతా నీళ్లు తీసుకోవాలి. మేము ఆంధ్రా ప్రజలకు, రైతులతో వ్యతిరేకం కాదు. తెలంగాణ ప్రజల, రైతుల ప్రయోజనాలు ముఖ్యం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి జుట్టు మా చేతిలో ఉంది, కేంద్రం మా చేతిలో ఉందని చంద్రబాబు అనుకుంటే మేము కచ్చితంగా వ్యతిరేకిస్తాం. నది ఏ బేసిన్లో ప్రవహిస్తదో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాక, కింది ప్రాంతాలు మిగతా నీళ్లు తీసుకోవాలి. గోదావరి, కృష్ణా నదులు సింహభాగం మన తెలంగాణలో ప్రవహిస్తాయి.. ముందు మన అవసరాలు, మనం తాగడానికి నీళ్లు తీసుకోవాలి. మా నికర జలాల్లో, మిగులు జలాల్లో మా వాటాను కేంద్రం తేల్చకుండా, నీళ్లు మేము తీసుకుంటామని ఆంధ్రా నాయకులు అనడం ఎలా? అని కేటీఆర్ నిలదీశారు. – కేటీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ తెలంగాణలోనే ఉన్నాయి. ఇవాళ కేఆర్ఎంబీని ఆంధ్రాకి తరలించి అదికూడా గొప్ప విజయమని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. తెలంగాణకు ద్రోహం చేసేందుకు కుట్ర జరుగుతుంది. బనకచర్లలో డబ్బులు ఖర్చు పెట్టి అనుమతులు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది. బనకచర్లపై పోరాటానికి ఎందాకైనా సిద్ధంగా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని సవరించుకోవాలి. సీఎం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే మరో ఉద్యమం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.
రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ గురించి తెలియదు. ఆయనకు రియల్ ఎస్టేల్, బ్లాక్ మెయిల్ దందాలే తెలుసు. రాయలసీమకు ప్రయోజనం చేకూరాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఇప్పుడు గురువుకు శిష్యుడు వంతపాడితే తెలంగాణకు అన్యాయం జరగదా..? మా గొడవ ఆంధ్రా ప్రజలతో కాదు.. మా హక్కు వాటా తేలాలని అడుగుతున్నాం. జై తెలంగాణ అనని సీఎం ఏపీకి అప్పచెబితే ఊరుకుంటామా..? అని కేటీఆర్ పేర్కొన్నారు.