KTR | హైదరాబాద్ : ఓ వైపు అందాల పోటీల్లో ముఖ్యమంత్రి మునిగితేలుతుంటే.. మరోవైపు వడదెబ్బకు తాళలేక ధాన్యం కుప్పలపైనే ఓ అన్నదాత బలికావడం అత్యంత బాధాకరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ చేతకానితనం వల్ల మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామంలో గుగులోతు కిషన్ (51) అనే రైతు నిండుప్రాణం గాలిలో కలిసిపోయింది. ఇది ముమ్మాటికీ ముఖ్యమంత్రి చేసిన హత్యే. పెట్టుబడి సాయం ఎగ్గొట్టినా, రుణమాఫీ పేరిట మోసం చేసినా ఆరుగాలం కష్టించి పండించిన పంటను చివరికి కొనే దిక్కు కూడా లేకపోవడంతో.. తెలంగాణ రైతన్న అనాథలా మారాడు అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఓవైపు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం అకాల వర్షాలతో కండ్లముందే కొట్టుకుపోతున్న దుస్థితి.. మరోవైపు మండుతున్న ఎండలను తట్టుకోలేక రైతుల గుండెలు పగులుతున్న దయనీయ పరిస్థితి.. వీటికి పూర్తి బాధ్యత ఈ దద్దమ్మ కాంగ్రెస్ సర్కారుదే. కొనుగోలు కేంద్రాల్లో వారాల తరబడి పడిగాపులు పడుతున్నా పట్టించుకునే వాడు లేకపోవడంతో అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. వడదెబ్బకు, సర్కారు నిర్వాకానికి బలైన అన్నదాత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రికి సోయి ఉంటే.. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతుల కష్టాలు తీర్చాలి. లేకపోతే కట్టలు తెంచుకునే అన్నదాతల ఆగ్రహానికి ఈ కాంగ్రెస్ సర్కారు కొట్టుకుపోతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.