హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ‘రాహుల్.. కండ్లుంటే చూడు. ఆదిలాబాద్ అన్నదాత బ్యాంకులో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన దైన్యాన్ని చూడు’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలతో బలవన్మరణానికి పాల్పడిన దయనీయ దృశ్యాలను చూడాలని ఆదిలాబాద్‌లోని ఒక ప్రైవేట్ బ్యాంకు సీసీటీవీ ఫుటేజ్‌ను రాహుల్‌గాంధీకి ట్యాగ్ చేశారు. రాష్ట్రంలో మాట తప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ దుర్మార్గచర్యలు పరాకాష్టకు చేరాయనేందుకు జాదవ్ దేవ్‌రావ్ అకాల మరణమే సాక్ష్యమని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ పట్టపగలు చేసిన హత్యకు ఇదే నిదర్శనమని మండిపడ్డారు.
తన ఆర్థిక ఇబ్బందులకు మరణమే శరణ్యమని 50 ఏండ్ల దేవ్‌రావ్ భావించటం విషాదకరమని, రైతు బలవన్మరణం, ఆయన కుటుంబంపై దగాకోరు కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్యాంకులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను చూసి అయినా రాహుల్ కండ్లు తెరవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ అమలైందని గొప్పలు చెప్పుకోవటం దారుణమని, రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 40 శాతం కూడా రుణమాఫీ అమలు కాలేదని చెప్పేందుకు జాదవ్‌రావ్ మరణోదంతమే నిదర్శనమని, ఎకరానికి రూ.15 వేల రైతుభరోసా అందిస్తామని చెప్పి యూటర్న్ తీసుకోవటం వంటి సంక్షోభ నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగాన్ని చీకట్లోకి నెట్టిందని మండిపడ్డారు.