 
                                                            KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన దోకేబాజ్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదాం అని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. షేక్‌పేట్ డివిజన్లో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రసంగించారు.
కొడుతున్నామా మళ్లీ జూబ్లీహిల్స్.. మీ జోష్ ఉత్సాహం చూస్తుంటే గెలుపు పక్కా మెజార్టీ ఏందనేది తేలాలి. మోసం చేసిన దోకేబాజ్ కాంగ్రెస్‌కు బుద్ధి చెబుదాం. సరిగ్గా 2014 జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి కొట్టాడితే రాష్ట్రం వచ్చింది. నాడు ఏ పరిస్థితి ఉండేనో గుర్తుకు తెచ్చుకోవాలి. 2014లో మనకు రాష్ట్రాన్ని రూ. 85 వేల కోట్ల అప్పుతో అప్పజెప్పారు. నాడు కరెంట్ లేదు. ఇనర్వర్టర్ లేని దుకాణం, జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు హైదరాబాద్ నగరంలో. మంచినీళ్ల గోసతో అప్పజెప్పారు. కేసీఆర్ కుటుంబ పెద్దగా ఈ రాష్ట్రం బాగాలేదని చెప్పలేదు. కష్టాలు కన్నీళ్లను తట్టుకుని కేసీఆర్ నిలబడ్డారు. ఎన్ని కష్టాలు, సమస్యలు ఉన్నా వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోయారు. పదేండ్లలో ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. 2014లో తలసరి ఆదాయం లక్ష రూపాయాలు ఉండే. కానీ 2023లో ఇండియాలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగి తలసరి ఆదాయాన్ని 3 లక్షల 87 వేల రూపాయాలకు తీసుకెళ్లారు అని కేటీఆర్ గుర్తు చేశారు.
కేసీఆర్ కరెంట్ సమస్యను పరిష్కరించి 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించారు. గ్రామాల్లో చెరువులు బాగు చేసి, గోదావరి, కృష్ణా నీళ్లు వ్యవసాయానికి అందించారు. హైదరాబాద్‌లో 42 ఫ్లై ఓవర్లు కట్టి అభివృద్ధి చేశారు. దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టారు. 1022 గురుకులాలు స్థాపించారు. పేద విద్యార్థులందరికీ కడుపు నిండా అన్నం పెట్టి చదువు చెప్పించారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలను అమలు చేశారు. పసిబిడ్డ నుంచి పండు ముసలి వరకు అందర్నీ ఆదుకున్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకరమైన మేలు చేసే ప్రయత్నం చేశారు. కానీ అన్యాయం చేయలేదు అని కేటీఆర్ తెలిపారు.
2023 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ఇవ్వలేదు హైదరాబాద్‌లో. కేసీఆర్‌కు జై కొట్టి.. మాగంటి గోపీనాథ్‌ను గెలిపించారు జూబ్లీహిల్స్‌లో. మరి దురదృష్టావశాత్తూ అనారోగ్య సమస్యలతో మన మధ్యలో లేకుండా పోయారు గోపన్న. ఇవాళ మాగంటి సునీతను ఆశీర్వదించి గెలిపిస్తారని విశ్వసిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ రెండేండ్లలో ఏవరికి అన్న మంచి జరిగిందా..? వాగ్దానాలు అమలయ్యాయో లేదో గుర్తు చేసుకోండి. అర చేతిలో స్వర్గం చూపించి అడ్డగోలు హామీలిచ్చి రైతులను, మహిళలను మోసం చేశారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చారు. పదేండ్ల మా పరిపానల మీ ముందు ఉంది. రెండేండ్ల కాంగ్రెస్ పాలన మీ ముందుంది. ఎవరి పాలనలో మంచి జరిగిందో ఆలోచించి ఓటేయండి. కాంగ్రెస్ ఓటేసేందుకు ఒక్క కారణం కూడా లేదు. ఒక్క ఆడబిడ్డకైనా 2500 అందాయా..? 4 వేల పెన్షన్, తులం బంగారం ఇచ్చారా..? స్కూటీలు ఇచ్చారా..? కరెంట్ కూడా చక్కగా ఇస్తలేరు. 20 వేల లీటర్ల వరకు ఫ్రీ వాటర్ ఇచ్చారు కేసీఆర్. ఈ ప్రభుత్వం వచ్చాక నీటి బిల్లులు వస్తున్నాయి. పేదలకు పథకాలు ఇచ్చే తెలివి లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. కేసీఆర్ మతం పేరు మీద రాజకీయాలు చేయలేదు. బతుకమ్మకు కేసీఆర్ చీరలు ఇచ్చే వారు. కాంగ్రెస్ పాలనలో చీరల్లేవు. రంజాన్ తోఫా వచ్చేది. ఇప్పుడు లేదు. క్రిస్మన్ కానుక కూడా వస్తలేదు. రెండేండ్ల నుంచి ఒక్క హామీ కూడా అమలు కాలేదు అని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 
                            