KTR | హైదరాబాద్ : ముఖం బాగా లేక అద్దం పగలగొట్టినట్టు, పరిపాలన చేతగాక కేసీఆర్పై అభాండాలు వేస్తున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మహేంద్ర తోటకూరి రచించిన ప్రజా యోధుడు పుస్తకాన్ని తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆవిష్కరించి మాట్లాడారు.
కరోనా సమయంలో రూపాయి ఆదాయం లేకపోయినా, ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగలేదు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, పెన్షన్లు, ధాన్యం కొనుగోలు ఆగలేదు. హైదరాబాద్లో రోడ్లు కూడా వేశాం. సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కాబట్టే ఆదాయం లేకపోయినా సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దుల మాదిరిగా పరుగులు పెట్టించాం. ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్టు, ఈ రోజు ఆదాయం ఉంది, అద్భుతమైన రాష్ట్రం ఉంది, కేసీఆర్ వేసిన అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకావడం లేదు. డబ్బులు కూడబెట్టుకొని ఢిల్లీకి మూటలు పంపాలన్న ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన రేవంత్ రెడ్డికి లేదు అని కేటీఆర్ విమర్శించారు.
తలసరి ఆదాయంలో దేశంలో 12వ స్థానంలో ఉన్న తెలంగాణను నంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ నాయకత్వం కాదా? “నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు” అన్న అపనమ్మకాన్ని పోగొట్టి, ఆడబిడ్డలు సర్కారు దవాఖానాల్లో కేసీఆర్ కిట్లు తీసుకొని పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన సంగతి వాస్తవం కాదా? మాతా శిశు మరణాలను తగ్గించి ఆరోగ్య రంగంలో 14వ స్థానం నుంచి మూడో స్థానానికి తెలంగాణ వచ్చిన మాట వాస్తవం కాదా? ఐటీ రంగం, పరిశ్రమలు, వ్యవసాయం, ఆరోగ్యం… ఇలా ఏ రంగం తీసుకున్నా కేసీఆర్ నాయకత్వం అద్భుతాలు సృష్టించింది. అలాంటి కేసీఆర్ గురించి మహేంద్ర సమగ్రంగా, అద్భుతంగా రాశారు. ఇందులో కేసీఆర్ బాల్యం, చదువు, రాజకీయాలు, ఉద్యమం, పదేళ్ల పాలన విజయాలు ఉన్నాయి. పదేళ్లు మనం శక్తియుక్తులన్నింటినీ తెలంగాణ నిర్మాణం మీద పెట్టాం. మనం చేసిన పోరాటాన్ని, తెలంగాణ గొప్పతనాన్ని చెప్పుకోలేకపోయాం. కాళోజీ, జయశంకర్, కేసీఆర్తో పాటు మరెందరో తెలంగాణ పోరాట యోధుల జీవిత చరిత్రలను నేటి యువతకు తెలిసేలా పుస్తకాలు, ఆడియో, వీడియో రూపాలను తీసుకురావాలి అని కేటీఆర్ సూచించారు.