సంగారెడ్డి, మే 4(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో పంటల కొనుగోలు ఆగమాగంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ సర్కార్‌లో నిర్లక్ష్యానికి గురవుతున్న రైతులకు అండగా బీఆర్ఎస్ కదం తొక్కనున్నట్టు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో శనగల కొనుగోలు కేందాన్ని సోమవారం పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతుల ఇబ్బందులు చూసి చలించిపోయి ఇదే కొనుగోలు కేంద్రం వేదికగా రాష్ట్ర రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ప్రకటించారు. రాబోయే వారం రోజులపాటు బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు రాష్ట్రంలోని అన్ని కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని, రైతులకు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. వరి, మక్క, జొన్న, శనగలు ఇతర కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని చెప్పారు. పంటలు ఎందుకు కొనుగోలు చేయటంలేదని, కొనుగోలు చేస్తే రైతులకు డబ్బులు ఎందుకు చెల్లించడం లేదని ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీయాలని సూచించారు.
ప్రభుత్వం స్పందించకుంటే తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధాన్యం కుప్పలుపోసి ధర్నాలకు బైఠాయించి ఎక్కడికక్కడ రైతులకు మద్దతుగా పోరాటం చేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. సదాశివపేట డీసీఎంఎస్ శనగల కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సంగారెడ్డి నియోజకవర్గంలో శనగ, జొన్న రైతులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, రైతులకు భరోసా ఇచ్చేందుకు సదాశివపేటకు రావాల్సిందిగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనను ఆహ్వానించారని తెలిపారు. ప్రభుత్వం శనగలు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రమంతటా శనగ, వరి, మక్క, జొన్న రైతుల పరిస్థితి ఇలాగే ఉన్నదని వాపోయారు. కొనుగోలు కేంద్రాల్లో లారీలు, గన్నీబ్యాగులు, టార్పాలిన్లు, సుత్లీదారం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు వివరించారు. దీన్ని గమనించి రాబోయే వారం పాటు రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పోరాటం చేయనున్నట్టు చెప్పారు. పంటలు ఏవైనా సరే రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి డబ్బులు రైతుల ఖాతాల్లో చేరే వరకు బీఆర్ఎస్ నాయకత్వం గట్టిగా పోరాడనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం పంటల కొనుగోలును నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇకనైనా అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పంటలను కొనుగోలు చేయకుంటే రైతులతో కలిసి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తామని హెచ్చరించారు.
కుంభకోణం వల్లే కొంటలేరే
సివిల్ సైప్లె కార్పొరేషన్లో జరిగిన కుంభకోణమే వరి కొనుగోలు చేయకపోవడానికి కారణమని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ రూ.1.6 లక్షల కోట్ల అప్పుల పాలైందని చెప్పారు. కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం కారణంగా సంస్థ ఎన్పీఏగా మారిందని తెలిపారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయలేక పోతున్నదని చెప్పారు. యాసంగిలో 95 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఇప్పటి వరకు కేవలం 9 లక్షల టన్నులే కొనుగోలు చేసిందని వివరించారు. రాష్ట్రంలో 9,500 కొనుగోలు కేంద్రాలకు గాను 6 వేల కేంద్రాలే ఏర్పాటు చేసిందని చెప్పారు. సంగారెడ్డిలో ఒక్క వరి కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు.
కేంద్రాల్లో గన్నీబ్యాగులు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, సుత్లీదారం కూడా దిక్కులేవని వాపోయారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు లేక, రైతుబంధు రాక, ధాన్యం కొనుగోలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. కేసీఆర్ హయాంలో 70 లక్షల మం ది రైతులు ఖాతాల్లో 11 సార్లు రైతుబంధు డబ్బులు రూ.73 వేల కోట్లు జమచేసినట్టు తెలిపారు. ప్రస్తుతం యాసంగి సాగు ముగిసినా ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తిస్తాయిలో రైతుల ఖాతాల్లో డబ్బులు వేయలేదని చెప్పారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ సైతం చేయలేదని తెలిపారు. పంటలకు మద్ద తు ధర, బోనస్ దక్కడం లేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు నిలిపివేస్తే బోనస్ ఇచ్చే బాధ తప్పుతుందని కాంగ్రెస్ భావిస్తున్నదని విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం ఆంక్ష లు లేకుండా పంటలు కొనాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానందగౌడ్, జిల్లా నాయకులు శివకుమార్, పీ మాణిక్యం, మఠం భిక్షపతి, కాసాల బుచ్చిరెడ్డి, మామిళ్ల రాజేందర్, నరహరిరెడ్డి, మందుల వరలక్ష్మి, శివరాజ్‌పాటిల్ పాల్గొన్నారు.
రైతుల మరణాలు ప్రభుత్వ హత్యలే
రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రైతుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని కేటీఆర్ నిప్పులుచెరిగారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ ఇద్దరు రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా రాయపోల్ గ్రామంలో రైతు గౌరయ్య వడదెబ్బతో ధాన్యం కుప్పపై కూలిపోయి చనిపోయాడని, మహబూబాబాద్ జిల్లా సూదనపల్లి కొనుగోలు కేంద్రంలో రైతు వెంకన్న పిడుగుపాటుకు గురై మృతిచెందాడని తెలిపారు. ఇద్దరు రైతుల చావులు ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఇద్దరు రైతుల ప్రాణాలు దక్కేవని చెప్పారు. ప్రభుత్వ చర్యలు రైతులను చంపే ప్రయత్నంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు చనిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని, ఇప్పటి వరకు సీఎం రేవంత్‌రెడ్డి గానీ, మంత్రులు గానీ ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా సందర్శించలేదని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధాన్యం కొనుగోళ్లపై ఇష్టారాజ్యంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి గద్దెనెక్కిన తర్వాత చేతులెత్తేశాడని దుయ్యబట్టారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం, మంత్రులు జాడ లేకుండా పోయారని, తప్పించుకు తిరుగుతున్నారని నిప్పులు చెరిగారు.
రియల్ బ్రోకర్ దందాపైనే సీఎం ధ్యాస
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భూముల కొనుగోలు, అమ్మకం, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందాపై ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై లేదని కేటీఆర్ దెప్పిపొడిచారు. రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగు కాగా 10 లక్షల టన్నుల మక్కజొన్న కొనుగోలు చేయాల్సి ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వం నామమాత్రంగానే కొనుగోలు చేసిందని చెప్పారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో 750 మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 80 కేంద్రాలే పెట్టినట్టు తెలిపారు. కేసీఆర్ పాలనలో తెల్లజొన్నలు, ఎర్రజొన్నలు, వరి అన్ని రకాల పంటలను కొనుగోలు చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడా జొన్నలు కొనుగోలు చేయలేదని తెలిపారు. సదాశివపేటలో శనగల కొనుగోలు కేంద్రంలో 110 టన్నుల శనగలు కొనుగోలు చేయాల్సి ఉంటే కేవలం 20 టన్నులే కొన్నట్టు చెప్పారు. రైతులు పండించిన శనగలు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని వ్యవసాయ మంత్రికి జిల్లా మంత్రి దామోదర లేఖరాసినా స్పందన లేదని చెప్పారు.
ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం మూలంగా రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోతున్నరు. వరి క్వింటాల్‌కు రూ.2,380 ఉంటే రైతులు విధిలేక రూ.1,600కు అమ్ముకుంటున్నరు. మక్కలకు రూ.3,600 ఉంటే రూ.1500కే అమ్ముకుంటున్నరు. శనగలకు రూ.5,800 ఉంటే రూ.4 వేలకే అమ్ముకొని ఆర్థికంగా నష్టపోతున్నరు.
– కేటీఆర్