KTR | మీరిచ్చిన హామీలు ఏమైనయ్ అని అడిగితే.. ఎంత పెద్ద కండలు తిరిగిన పహిల్వాన్ అయినా మూడు నెలల్లో పిల్లలు పుట్టించలేడని సీఎం రేవంత్ అంటున్నడు. తొమ్మిది నెలలు పడుతది గదా అంటూ లేకి మాటలు మాట్లాడుతున్నడు. మరి, 30 నెలలైనా పిల్లలు పుట్టకపోతే నీకు ఏం పేరు పెట్టాలె? నిన్ను ఏమని పిలువాలె? మీ హామీల అమలుకు రెండున్నరేండ్లయినా సరిపోదా?
– కేటీఆర్
మంచిర్యాల, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి ‘మొత్తం దోచుకో.. దాచుకో’ అనే స్కీమ్ నడిపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎక్కడ ఏది దొరుకుతుందో అది దోచుకోవడం, తీసుకపోయి దాచుకోవడం తప్ప కాంగ్రెస్ పాలనలో వేరే ఏదీ నడువడం లేదని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సకుటుంబ సపరివార సమేతంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ దోపిడీకి తెర తీశారని విమర్శించారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్‌రెడ్డి కనుసన్నల్లోనే సింగరేణిలో ప్రతి కాంట్రాక్టు నడుస్తున్నదని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్భవన్లో ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యకర్తల సమావేశంతోపాటు క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ల సన్నాహక కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కొత్త స్కీమ్ తీసుకొచ్చారని, దాని ప్రకారం సింగరేణిలో ఎవరన్నా టెండర్ వేయాలంటే సైట్ విజిట్‌కు రావాల్సి ఉంటుందని చెప్పారు. అలా సైట్విజిట్కు వచ్చినవారికి ఓ వ్యక్తి ఫోన్ చేసి, తాను ముఖ్యమంత్రి బావమరిదినని, టెండర్ వేయొద్దని బెదిరిస్తారని ఆరోపించారు. ఆయన మాట వినకపోతే సైట్విజిట్ సర్టిఫికెట్ ఇవ్వరని పేర్కొన్నారు. సృజన్‌రెడ్డి అనే ముఖ్యమంత్రి బావమరిది ఇవాళ సైట్ విజిట్ సర్టిఫికెట్‌ను అడ్డం పెట్టుకొని రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడితే దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడరని దుయ్యబట్టారు.
కేసీఆర్ సర్కార్‌లో మెడికల్ బోర్డు పెట్టి 16 వేల మందికి వారసత్వ ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ, ఈరోజు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇయ్యకపోగా, మెడికల్ బోర్డ్ పెట్టకపోగా, గతంలో తాము ఇచ్చిన 16 వేల ఉద్యోగాలపై ఏసీబీ విచారణ, విజిలెన్స్ విచారణ చేయిస్తామంటూ ఉపముఖ్యమంత్రి శాసనమండలిలో స్టేట్మెంట్ ఇచ్చారని దుయ్యబట్టారు. దమ్ముంటే సృజన్రెడ్డిపై సిట్ వేసి, ఏసీబీ ఎంక్వైరీ చేయించాలని ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కేటీఆర్ సవాల్ విసిరారు. విచారణ చేయాల్సింది తాము ఇచ్చిన 16 వేల ఉద్యోగాలపై కాదని, సృజన్రెడ్డిపై చేయాలని డిమాండ్ చేశారు. దానికంటే ముందు మెడికల్ బోర్డ్ పెట్టాలని, లేనిపక్షంలో సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు. కచ్చితంగా ప్రతి బొగ్గుగనిలో అగ్గి మండిస్తామని, వదిలి పెట్టేదే లేదని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల కోసం బరాబర్ కొట్లాడుతామని, కార్మికులు కూడా తమతో కలిసి రావాలని, ఇక్కడి ఎమ్మెల్యేలను గల్లాపట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధుకు రాం..రాం.. అవుతుందని, మొత్తం తెలంగాణను అమ్ముకదోస్తరని కేసీఆర్ చెప్పారని, ఇవాళ అదే జరుగుతున్నదని పేర్కొన్నారు. కేసీఆర్ మాటలు వినకపోవడంతో భస్మాసుర హస్తం వచ్చిందని, ఇప్పుడు ఆ దరిద్రం ఎప్పుడు పోతదా అని ఎదురు చూసే రోజులొచ్చాయని చెప్పారు.
సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉన్నప్పటికీ, సంస్థలో జరుగుతున్న కుంభకోణాలపై ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్-బీజేపీ చీకటి దోస్త్లని, ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్‌రెడ్డికి ఇక్కడ సింగరేణి టెండర్లు మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్‌లో సైతం రూ.వందల కోట్ల కాంట్రాక్టులు వస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీలకు ముఖ్యమంత్రి తెలంగాణలో కాంట్రాక్ట్‌లు ఇస్తున్నారని చెప్పారు. ఇలా కాంట్రాక్ట్‌లు ఇచ్చిపుచ్చుకొనే బంధంతో కాంగ్రెస్, బీజేపీ కలిసి నడుస్తున్నాయని విమర్శించారు. ఒకరి దోపిడీని ఒకరు బయట పెట్టకుండా బ్రహ్మాండంగా కాపాడుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్ఆర్ (రాహుల్, రేవంత్) ట్యాక్స్ నడుస్తున్నదని చెప్పిన ప్రధాని మోదీ.. దీనిపై ఎందుకు విచారణ జరుపడం లేదని కేటీఆర్ నిలదీశారు. హోం శాఖ మంత్రి అమిత్‌షా వచ్చి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారిపోయిందని, కుంభకోణాలు చేస్తున్నారని అనడం తప్ప మరి ఆ కుంభకోణాలు చేసే దొంగలను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు.
బ్రహ్మాండంగా గోదావరి నదిపై కేసీఆర్ నాయకత్వంలో మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకుంటే, ఆ కాళేశ్వరాన్ని ఒకడు కూళేశ్వరం అంటాడని, మరొకడు రూ.లక్ష కోట్లు కొట్టకుపోయాయని అబద్ధాలు మాట్లాడుతాడని కేటీఆర్ మండిపడ్డారు. ‘కాళేశ్వరాన్ని కూళేశ్వరం అయిపోయిందంటున్న సన్నాసులను అడుగుతున్నా… 2014లో తెలంగాణలో పండిన పంట ఎంత? 2020-21లో పండిన పంట ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు తెలంగాణ ప్రాంతంలో 2014కు ముందు దుర్భిక్షమైన పరిస్థితులున్న మాట వాస్తవం కాదా? తెలంగాణలో పంటలు ఎండిపోయింది నిజం కాదా? తెలంగాణలో ఆనాడు 24 లక్షల టన్నుల ధాన్యం పండే పరిస్థితుల నుంచి, కేసీఆర్ వచ్చాక 1.5 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థితికి చేరుకున్న మాట వాస్తవం కాదా? పంజాబ్, హర్యానాను తలదన్ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను నిలిపిన మాట వాస్తవం కాదా? ఇది కాళేశ్వరం పుణ్యం కాదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఇవాళ ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి తమ్మిడిహట్టి కడుతామని చెప్తున్న ముఖ్యమంత్రికి ఎక్కడ కడుతారో కనీసం ఐడియా ఉన్నదా? డీపీఆర్ అయ్యిందా? మహారాష్ట్రతో ఒప్పందం అయ్యిందా? ఎన్ని మీటర్లకు అంగీకారమైందో తెలుసా?’ అని నిలదీశారు. ఏమీ తెల్వకపోయినా ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయని ఎద్దేవా చేశారు. ‘బడ్జెట్లో తమ్మిడిహట్టికి రూ.52 కోట్లు పెట్టారు. ఈ రూ.52 కోట్లతో ఎన్నేండ్లు కడుతారు? వందేడ్లు కడుతరా? వెయ్యేండ్లు కడుతరా? ఇలాగే మాటలతో టైమ్‌పాస్ చేస్తారా?’ అని కేటీఆర్ నిలదీశారు. కాళేశ్వరం కట్టింది తెలంగాణకు న్యాయం చేయడానికి, తెలంగాణకు లాభం చేయడానికేనని స్పష్టంచేశారు. ‘సింగరేణిని లాభాల బాటలో నడిపింది.. కార్మికులకు బోనస్ ఇచ్చింది.. పదేండ్లపాటు తెలంగాణను అపూర్వంగా నడిపింది.. అన్నిరంగాలను ముందుకు తీసుకెళ్లింది కేసీఆరే’ అని పేర్కొన్నారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్, సీపీఐ కలిసి కైవసం చేసుకున్న సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ సంధార్యాణితోపాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లను కేటీఆర్ సన్మానించారు. పొత్తు ధర్మాన్ని పాటించి, దానికి కట్టుబడిన సీపీఐ కౌన్సిలర్లకు, ఆ పార్టీ జిల్లా నాయకత్వానికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం క్యాతనపల్లిలోని బాల్కసుమన్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడం, రానున్న రోజుల్లో పార్టీ అనుసరించనున్న విధానాలు, నియోజకవర్గాల పునర్విభజనతో బీఆర్ఎస్కు జరిగే మేలు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, వివిధ రంగాలపై తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. అనంతరం చెన్నూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సెల్ఫీలు దిగారు.
మంచిర్యాల జిల్లా పర్యటన సందర్భంగా స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించిన బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కుమార్తె వివాహానికి కేటీఆర్ హాజరయ్యారు. నూతన వధూవరులు నిహారిక-రామోజీ నిశాంత్‌ను ఆశీర్వదించారు.
ఇవాళ కేసీఆర్ ప్రభుత్వమే వచ్చి ఉంటే రూ.4వేల పింఛన్ ఎప్పుడో వచ్చేది, దివ్యాంగులకు రూ.6వేల పింఛన్ వచ్చేదని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వమే వచ్చి ఉంటే రూ.15వేల రైతుబంధు ఎప్పుడో వచ్చేదని పేర్కొన్నారు. అందుకే మొన్న క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఏ ప్రజాస్వామ్య స్ఫూర్తినైతే చూపించారే, అదే స్ఫూర్తిని తెలంగాణ సమాజం చూపించాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. రాష్ర్టాన్ని సాధించిన, ఈ రాష్ర్టాన్ని పదేండ్లపాటు దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్‌ను 2028లో కచ్చితంగా ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలోని, రైతుల, పేదల, సింగరేణి కార్మికుల ముఖాల్లో మళ్లీ చిరునవ్వులు చూడాలంటే తిరిగి కేసీఆర్ రావాల్సిందేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, కోనేరు కోనప్ప, కోరుకంటి చందర్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ యూత్ లీడర్ విజిత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బోథ్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు లేకి మాటలు మాట్లాడారని కేటీఆర్ విమర్శించారు. ఎంత పెద్ద కండలు తిరిగిన పైల్వానైనా మూడు నెలల్లో పిల్లలు పుట్టియలేడు గదా.. తొమ్మిది నెలలు పడుతది గదా అంటూ లేకి మాటలు మాట్లాడారని దుయ్యబట్టారు. నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది మీరు కాదా? అని ప్రశ్నించారు. ‘మూడు నెలల్లో పిల్లలు పుట్టరన్న ముఖ్యమంత్రీ.. ముప్పై నెలలు అయినా పిల్లలు పుట్టకపోతే నీకు ఏ పేరు పెట్టాలి? నిన్ను ఏమని పిలువాలి?’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇంత లేకి ముఖ్యమంత్రి, ఇంత పెద్ద మొత్తంలో దోచుకుంటున్న ముఖ్యమంత్రి భారతదేశంలో లేరని వ్యాఖ్యానించారు.
రాష్ర్టాన్ని సాధించిన, ఈ రాష్ర్టాన్ని పదేండ్లపాటు దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్‌ను 2028లో కచ్చితంగా ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఈ రాష్ట్రంలోని, రైతుల, పేదల, సింగరేణి కార్మికుల ముఖాల్లో మళ్లీ చిరునవ్వులు చూడాలంటే తిరిగి కేసీఆర్ రావాల్సిందే.
-కేటీఆర్
కాంగ్రెస్-బీజేపీ చీకటి దోస్త్‌లు. ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్‌రెడ్డికి ఇక్కడ సింగరేణి టెండర్లు మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్‌లో సైతం వందల కోట్ల కాంట్రాక్టులు వస్తున్నాయి. బీజేపీ ఎంపీలకు ముఖ్యమంత్రి తెలంగాణలో కాంట్రాక్ట్‌లు ఇస్తున్నారు. ఇలా కాంట్రాక్ట్‌లు ఇచ్చిపుచ్చుకొనే బంధంతో కాంగ్రెస్, బీజేపీ కలిసి నడుస్తున్నాయి. ఒకరి దోపిడీని ఒకరు బయట పెట్టకుండా బ్రహ్మాండంగా కాపాడుకుంటున్నారు.
-కేటీఆర్
ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి తమ్మిడిహెట్టి కడుతామని చెప్తున్న ముఖ్యమంత్రికి ఎక్కడ కడుతారో కనీసం ఐడియా ఉన్నదా? డీపీఆర్ అయ్యిందా? మహారాష్ట్రతో ఒప్పందం అయ్యిందా? ఎన్ని మీటర్లకు అంగీకారమైందో తెలుసా? ఏమీ తెల్వకపోయినా ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి. బడ్జెట్లో తమ్మిడిహెట్టికి రూ.52 కోట్లు పెట్టారు. ఈ రూ.52 కోట్లతో ఎన్నేండ్లు కడుతారు? వందేడ్లు కడుతరా? వెయ్యేండ్లు కడుతరా? ఇలాగే మాటలతో టైం పాస్ చేస్తారా?
-కేటీఆర్