హైదరాబాద్ జూలై 6 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ పాలనలో రైతు భరోసాకు దిక్కులేదు, రైతు రుణమాఫీకి మొక్కులేదు.. చివరికి అప్పులు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఎరువులు కూడా కరువయ్యాయి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు చెప్పినట్టు ఆధార్ కార్డు ఇచ్చినా రైతుకు కనీసం బస్తా ఎరువు ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఎందుకున్నది? రాష్ట్రవ్యాప్తంగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఎందుకున్నది?’ అని ఆదివారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని పలు సహకార కేంద్రాల వద్ద ఎరువుల కోసం బారులు తీరిన ఫొటోలను తన పోస్ట్‌కు ట్యాగ్ చేశారు. రూ. 266.50 ఉండాల్సిన యూరియా బస్తా ధర రూ.325కు ఎందుకు పెరిగిందో ప్రజలకు తెలియాలని చెప్పారు. ‘బ్లాక్ మార్కెట్ దందాను నడిపిస్తున్నది ఎవరు? ఈ కొరతకు కారకులెవరు? ఎరువులను బుక్కేస్తున్న మేతన్నలెవరో? బయటపడాలని కావాల్సి ఉన్నది’ అని ధ్వజమెత్తారు.