హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇండ్లను, హెచ్‌సీయూలో పక్షుల గూళ్లను సైతం రేవంత్ సర్కారు వలిపెట్టడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ‘నోరున్న జనంపైకి బుల్డోజర్.. నోరు లేని జీవాల మీదికీ బుల్డోజర్’ అంటూ మంగళవారం ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. వర్సిటీ భూములను సర్కారు చర్యలను ఖండిస్తూ ‘మూసీ, హైడ్రాలో మూటల వేట-ఆఖరికి హెచ్‌సీయూలోనూ కాసుల వేట! నీళ్లు లేక పంటలు ఎండుతూ రైతుల గోస – అర్ధరాత్రి బుల్డోజర్ల దెబ్బలకు వన్యప్రాణాల హాహా కారాలు! చదువుల చెప్పే చోట విధ్వంసం – వి లువగల భూములపై వికృత క్రీడ!’ అంటూ కవితాత్మకంగా విమర్శలు గుప్పించారు. ‘ప్రజలను పాలించే నాయకుడివా?-భూములు చెరబట్టే రియల్ ఎస్టేట్ బ్రోకర్‌వా?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. ‘నాడు ఫుట్‌బాల్‌తో నీకు ఆటవిడుపు-ఇప్పుడు మూగజీవాల ప్రాణాలు, భావిభారత విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా?’ అని నిలదీశారు. ‘ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను హింసించే పాలన.. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అమలులో ఉన్న ఇందిరమ్మ రాజ్యం’ అంటూ నిప్పులు చెరిగారు.
‘జాగో.. తెలంగాణ జాగో!’ అని పిలుపునిచ్చారు. రాహుల్జీ.. ద్వంద్వ విధానాలెందుకు?కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ విధానాలు పాటిస్తున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో హెచ్‌సీయూలో అమరుడైన రోహిత్ వేములకు న్యాయం కోసం రాహుల్ ఆందోళన చేశారని తెలిపారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నదని, తమ ను హెచ్సీయూరి వెళ్లకుండా అడ్డుకుంటున్నదని విమర్శించారు. తాను బయటకు వెళ్లకుండా ఇంటి వద్ద మోహరించిన పోలీసు బలగాల వీడియోను కేటీఆర్ ఎక్స్ వేదికగా మంగళవారం షేర్ చేశారు. ఎందుకు కపటనాటకాలు, ద్వంద్వ వైఖరి రాహుల్జీ అని నిలదీశారు.