హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టే పదేండ్ల కేసీఆర్ పాలన వైభవాన్ని తొక్కిపట్టలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. చేతకాని పాలనతో తెలంగాణను ఆగం చేసి, వాస్తవాలను బయటపెట్టిన అధికారులపై కక్షకట్టడం సీఎం రేవంత్‌రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనమని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ పాలన వైభవాన్ని సీఎం కక్షపెంచుకొని ఆపాలని చూసినా ‘అట్లాస్’ (తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్) రూపంలోనో, మరో రూపంలోనో బయటికివస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ దార్శనిక పాలనకు, దద్దమ్మ కాంగ్రెస్ పాలనకు ఉన్న స్పష్టమైన తేడా, నాలుగు కోట్ల సమాజం ముందు ‘అట్లాస్’ రూపంలో బట్టబయలు కావడంతో ముఖ్యమంత్రికి మింగుడుపడటం లేదని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ హ యాంలో సాధించిన ఘనమైన గతాన్ని తొకిపెట్టడం, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆప డం ఎవరికీ సాధ్యం కాదని పేర్కొన్నారు. అధికార యంత్రాంగంపై కూడా వేధింపులకు పాల్పడటం సిగ్గుచేటని విమర్శించారు. తలసరి ఆదాయంలో నంబర్‌వన్‌గా ఉన్న రాష్ర్టాన్ని తలకు మాసిన నిర్ణయాలతో దివాలా తీసేస్థితికి తెచ్చి ఇప్పటికే క్షమించరాని పాపాన్ని ముఖ్యమంత్రి మూటగట్టుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో వ్యవసాయరంగంలో సాధించిన విప్లవం, పారిశ్రామిక రంగంలో పరుగులు పెట్టిన ప్రగతిపథం.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుందని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనా సౌరభాలను వైబ్‌సైట్ నుంచి తొలగించినంత మాత్రాన, చేయని త ప్పునకు అధికారులపై వేటు వేసినంత మాత్రాన ‘పదేండ్ల ముఖచిత్రాన్ని, సువర్ణాక్షరాలతో లిఖించిన స్వర్ణయుగాన్ని చెరిపేయడం ముఖ్యమంత్రి వల్లే కాదు.. ఢిల్లీ పార్టీ ముత్తాతల వల్ల కూడా కాదు’ అని తేల్చిచెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సరారు చేస్తున్న చిల్లరచేష్టలు మానుకుంటే మంచిదని చెప్పారు.
నేడు ‘టెక్ ఇన్నోవెటివ్ సమ్మిట్’లో కేటీఆర్ ప్రసంగం
టెక్ ఇన్నోవెటివ్ సమ్మిట్’లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. బెంగళూరులో గురువారం జరగనున్న ప్రతిష్టాత్మక ఈ సమ్మిట్‌లో ‘డ్రైవింగ్ డిజిటల్ ఇండియా ఇన్నోవేషన్స్ స్ట్రాటజీస్ ఫర్ ఏ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ఫ్యూచర్’ అనే అంశంపై కేటీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారు.