హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతుల కన్నీళ్లను పారిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీకోరు సర్కారుగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతుల కన్నీళ్లే కూల్చివేస్తాయని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజే నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవటం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులను వంచించి పొట్టనబెట్టుకుంటున్న సర్కారు, రైతుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదని మంగళవారం ఎక్స్‌వేదికగా ధ్వజమెత్తారు. ‘తోడేళ్లలా ప్రాణం తీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిది. కాంగ్రెస్ కాదిది ఖూనీకోర్. ఆత్మహత్యలు కావివి ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కా ర్ చేసిన హత్యలు. రుణమాఫీ చేయకుండా తీసిన ప్రాణాలు.. రైతుబంధు వేయకుండా చేసిన ఖూనీలు.. ఆ కుటుంబాల మనోవేదనలే మీ సరారుకు మరణశాసనం రాస్తాయి. వారి కన్నీళ్లే కపట సరారును కూల్చి వేస్తయి’ అని నిప్పులు చెరిగారు.