KTR | హైదరాబాద్ : తెలంగాణ కొంగుబంగారం సింగరేణిని కాంగ్రెస్, బీజేపీలు ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీల నాయకులకు తెలంగాణ మీద ప్రేమ అస్సలు లేదన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు కొట్లాడేది ఒక్క కేసీఆర్ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు.
భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్తో 117 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవడం రేవంత్ చేతకానితనానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక మూడు వేల మంది గురుకుల విద్యార్థులు విషాహారంతో ఆసుపత్రి పాలయ్యారని చెప్పారు. కేసీఆర్ పెట్టిన 1022 గురుకులాల్లో పిల్లలకు సరైన ఆహారాన్ని పెట్టలేకపోతున్న రేవంత్, సిగ్గు లేకుండా తెలంగాణ రైజింగ్ అని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
గురుకుల విద్యార్థుల మరణాల్లో, ఫుడ్ పాయిజనింగ్ సంఘటనల్లో తెలంగాణ రైజింగ్ అయిందని విరుచుకుపడ్డారు. గురుకులాల పిల్లలకు పెడుతున్న విషాన్ని తన ఇంట్లో పిల్లలకు పెడితే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవిష్యత్తు అయిన పిల్లలు ఆగమవుతుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదన్నారు కేటీఆర్. అందాల పోటీల్లో పాల్గొన్న అందగత్తెలకు లక్ష రూపాయలతో ప్లేటు భోజనం, వేములవాడలో లక్షా 35 వేల రూపాయలతో ప్లేటు భోజనం తిన్న రేవంత్, గురుకులాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు వంద రూపాయలతో మంచి భోజనం పెట్టించడం లేదని విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమ ప్రాతిపదిక అయిన నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న రేవంత్ రెడ్డి ఆంధ్రకు నీళ్లు, ఢిల్లీకి నిధులు, చంద్రబాబు తొత్తులకు నియామకాలు ఇస్తున్నారని ఆరోపించారు. గురుకులాల్లో ఉన్న అధ్వానమైన పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం గురుకుల బాట కార్యక్రమాన్ని చేపడితే నాలుగు రోజులు హడావుడి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత చేతులు దులుపుకుంది.
వచ్చే 100 ఏళ్ల పాటు హైదరాబాద్కు తాగునీటి కరువు లేకుండా ముందుచూపుతో కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం అని కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ బరాజ్ మాత్రమే కాదని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలే మేడిగడ్డలో ఏదో చేశారు, అందుకే అక్కడ ప్రమాదం జరిగిందన్న అనుమానం ఉందని కేటీఆర్ తెలిపారు. కాళేశ్వరంతో కేసీఆర్కు మంచిపేరు వస్తుందన్న అక్కసుతో కాంగ్రెస్ నేతలు లక్ష కోట్ల అవినీతి అని అబద్ధాలు ప్రచారం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే 80 వేల కోట్లతో అయితే లక్ష కోట్ల అవినీతి ఎక్కడిదని, అన్నీ బక్వాస్ మాటలని రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామనే అన్నాడని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం కేసీఆర్ సొంత ఆస్తి కాదని, తెలంగాణ ప్రజల సొత్తు అని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం
చేసిన పనిని సరిగా చెప్పుకోలేక మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయామని కేటీఆర్ అంగీకరించారు. చిన్నచిన్న ఇబ్బందులను ఇప్పటినుంచే పరిష్కరించుకొని సమన్వయంతో పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో, బొగ్గు గని కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిబద్ధత కలిగిన నాయకులు, కార్యకర్తలు ఎందరో బీఆర్ఎస్, టీబీజీకేఎస్లో ఉన్నారని ఆయన ప్రశంసించారు. తమ్మ శ్రీకాంత్ అనే టీబీజీకేఎస్ కార్యకర్త కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా చెప్పులు వేసుకోనని ప్రమాణం చేశారని, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవరకు చెప్పులు వేసుకోనని శపథం చేసి మోకాళ్ల నొప్పులు బాధిస్తున్న కూడా అభిమానాన్ని చూపించారని కేటీఆర్ గుర్తు చేశారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇలాంటి నిబద్ధత కలిగిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో ఎందరో ఉన్నారని, అది పార్టీ చేసుకున్న అదృష్టమని ఆయన అన్నారు.