KTR | హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత ఊకంటి ప్రభాకర్ రావుతో పాటు 300 మంది కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2023 ఎన్నికల్లో మనం ఓవర్ కాన్ఫిడెంట్‌గా పోయాం. ఎక్కడా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి చెప్పలేదు. ఈ రాష్ట్రానికి ఎంతో చేశాం కానీ.. ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాం. 2014కు పూర్వం మన బీళ్లకు గోదావరి, కృష్ణా నీళ్లు రాలేదు. 2014కు పూర్వం తెలంగాణ ప్రాంతం భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో 14వ ర్యాంకులో ఉండేది. అదే కేసీఆర్ నాయకత్వంలో గోదావరి, కృష్ణాలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి.. నీళ్లను బీళ్లకు మళ్లించారు. 2014 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్లో నంబర్ వన్ స్థానానికి ఎదిగాం అని కేటీఆర్ తెలిపారు.
గోదావరిలో సమృద్ధిగా ఎక్కడ నీళ్లు దొరకుతాయో అధ్యయనం చేసి, ఆలోచించి మేడిగడ్డ వద్ద ఏడాదంతా నీళ్లు ఉంటాయని.. అక్కడ నీళ్లు ఒడిసిపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. రోజుకు 2 టీఎంసీల నీటిని కొండపోచమ్మ సాగర్‌కు తీసుకొచ్చే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ లిఫ్ట్ ఎక్కడుందంటే మన తెలంగాణలో కాళేశ్వరం ఉంది. శివుడు భువి నుంచి దివికి నీళ్లు తీసుకొచ్చారని చెబుతారు కానీ కేసీఆర్ కింద నుంచి మీదకు నీళ్లు తీసుకొచ్చారు. 80 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తుకు నీళ్లను తీసుకొచ్చారు. సాగునీరు ఇవ్వడమే కాకుండా అన్ని గ్రామాలకు తాగునీరు ఇచ్చారు. సాగునీరు, తాగునీరు, ఇండస్ట్రీలకు నీరందించే విధంగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులను నిర్మిస్తే ఇప్పుడు ఆయన మీద సీబీఐ కేసులు పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ కత్తులు దూస్తారు. రాహుల్ ఏమో సీబీఐ మోదీ జేబు సంస్థ అని అంటుంటే.. రేవంత్ రెడ్డేమో సీబీఐ గొప్ప సంస్థ అని అంటున్నారు. సీబీఐ, ఈడీ మీద కాంగ్రెస్ దుమ్మెత్తి పోస్తుంటే.. రేవంత్ మాత్రం వారికే అప్పగిస్తున్నాడు. ఇందతా రాజకీయ కుట్ర. తెలంగాణ పచ్చబడుతుంటే కొందరి కళ్లు ఎర్రబడుతున్నాయి. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
21 నెలలో డైలాగులు తప్ప ఒక్క పని జరగలేదు. అప్పు లేని మనిషి ఉంటాడా..? అప్పుల్లేకుండా పనులు అవుతాయా..? అప్పున్న, ఎన్ని తిప్పలున్నా, లోపల బనియన్‌కు పొక్కలు ఉన్నా పైన మాత్రం మంచి అంగి వేసుకుంటాం. మళ్లీ ఎవడన్న అప్పు ఇవ్వాలి కాదా..? దుకాణం నడవాలంటే అప్పు పుట్టాలి.. రొటేషన్ జరగాలి. కానీ ఈ రేవంత్ రెడ్డి మాత్రం నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్, ఎయిడ్స్ రోగి అంటే అప్పు ఎవడిస్తాడు అని కేటీఆర్ నిలదీశారు.