KTR | మేడ్చల్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): రాహుల్‌గాంధీని సీఎం రేవంత్‌రెడ్డి పిచ్చోడిని చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ‘రాహుల్ ఏమో మోదీని చౌకీదార్ చోర్ అంటే.. రేవంతేమో బడే భాయ్ అని అంటున్నారు. అదానీ ఫ్రాడ్ అని ఆయన అంటే.. హమారా ఫ్రెండ్ అని ఈయన చెప్పుకుంటున్నారు. ఆయనేమో గుజరాత్ మాడల్ ఫేక్ అని అంటే.. ఈయనేమో తెలంగాణను గుజరాత్ మాడల్ చేస్తానని అంటున్నడు’ అని ఎద్దేవా చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో జరిగిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. కాంగ్రెస్ సర్కారును కూల్చే అవసరం తమకు లేదని, ఇచ్చిన హామీలను అమలు చెయ్యకపోతే వెంటాడి, వేటాడుతామని హెచ్చరించారు. రైతులకు చేస్తామన్న రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతు భరోసా ఏమైందని కాంగ్రెస్ సర్కారును ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే తొలి వ్యక్తి రేవంత్‌రెడ్డేనని ఆరోపించారు. మోదీ ఏం చేస్తాడోనన్న భయానికి ముందే బీజేపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని విమర్శించారు.
8 ప్రభుత్వాలను కూలదోసిన బీజేపీ
‘అయితే జేబులో ఉండాలె.. లేదంటే జైల్లో ఉండాలన్నాదే ప్రధాని మోదీ సిద్ధాంతం. 10 ఏండ్లలో బీజేపీ 8 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూలదోసింది. రాముడి పేరు చెప్పుకొని రాజకీయం చేసే బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి. భద్రాద్రి రాముడు, ఘట్కేసర్ రాముడి దేవాలయాలకు రూపాయి కూడా ఇవ్వని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఓటు వేద్దామా?’ అని అన్నారు. తాము యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించినా, ఏనాడైనా రాజకీయాలకు వాడుకున్నామా? అని అడిగారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, కౌశిక్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మేయర్లు జక్క వెంకట్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, మల్లారెడ్డి హెల్త్‌సిటీ చైర్మన్ భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగంపై చర్చ జరగాలి
దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యపై చర్చ జరగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. ఐఐటీ పట్టభద్రులకే ఉద్యోగాలు లభించడం లేదంటే దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న మన దేశంలో ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ సమస్య ఎంతో ప్రధానమైనదని పేర్కొన్నారు. ఐఐటీ బాంబేకు చెందిన తాజా బ్యాచ్ విద్యార్థుల్లో 36 శాతం మందికి ఉద్యోగాలు లభించలేదంటూ వచ్చిన వార్తా కథనాన్ని దీనికి ట్యాగ్ చేశారు.