KTR | హనుమకొండ, జూన్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేసీఆర్ పాలనలో తెలంగాణ సంక్షేమానికి, సకల రంగాల అభివృద్ధికి చిరునామాగా నిలిస్తే.. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పాలన సంక్షోభాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అంతులేని అబద్ధాలు, అడ్డగోలు హామీలతో వచ్చిన కాంగ్రెస్ పాలన తెలంగాణ ప్రజల పాలిట ఉరితాడైన పరిస్థితి కనిపిస్తున్నదని ధ్వజమెత్తారు.
30 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ర్టానికి జరిగిన వినాశనం, విషాదం బహుశా ఎవరూ ఊహించి ఉండరన్న కేటీఆర్.. హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే సీఎం రేవంత్‌రెడ్డి బూతుల మోతలు, ఎగవేతలు, కూల్చివేతల పథకాలు అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పాలిట శని అని విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డి ఇప్పటికే 73 సార్లు ఢిల్లీకి పోయిండు. కనీసం వంద పైసలు తెచ్చినవా? ఢిల్లీకి ఇచ్చుడు తప్ప తెచ్చుడు లేదు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదని, మాఫియా రాజ్యం నడుస్తున్నదని దుయ్యబట్టారు.
వర్ధన్నపేట మాజీ ఎమ్మల్యే అరూరి రమేశ్, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్యర్యంలో సోమవారం హనుమకొండలో వేర్వేరుగా జరిగిన ఆయా నియోజకవర్గాల ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదు, సోషల్ మీడియా శిక్షణ తరగతుల సమావేశంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘ఎస్ఐఆర్, డిజిటల్ సభ్యత్వ నమోదుపై బీఎల్ఏలు, బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రైతులు పండించిన పంటల కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని, వచ్చే సీజన్ నుంచి కొనుగోలు చేసేవారే ఉండరని, రాబోయే రోజుల్లో బోనస్ ఉండదని చెప్పారు. కేసీఆర్ కరోనా సమయంలోనూ వడ్లను కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతూ కేసులు పెట్టి వేధిస్తున్న రేవంత్‌రెడ్డికి వచ్చే ఐదేండ్లు సినిమా చూపించడం ఖాయమని తేల్చిచెప్పారు. సప్తసముద్రాల ఆవల దాక్కున్నా వదిలేది లేదని కేటీఆర్ హెచ్చరించారు.
‘బీఆర్ఎస్ అధికారం మాత్రమే కోల్పోయింది. ప్రజల అనురాగం, మమకారం కాదు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సంక్షోభంలోకి వెళ్లింది. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు.. పాలేరు నుంచి జహీరాబాద్ వరకు ఎక్కడికి పోయినా గులాబీ జెండా రెపరెపలాడుతుంది’ అని కేటీఆర్ పేర్కొన్నా రు. ‘క్యాలెండర్ ఎప్పుడు మారుతుందా? 2028 ఎప్పుడు వస్తుందా? కేసీఆర్ ఎప్పుడు సీఎం అయి తెలంగాణను పట్టాలెకిస్తాడా? అని ఎదురుచూస్తున్నారని చెప్పారు. కార్యకర్తలు చేసే పోరాటాలు ధైర్యాన్ని, కొండంత నమ్మకాన్ని నింపుతున్నాయని, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజల కోసం కష్టపడుతున్నారని ప్రశంసలు కురిపించారు. దేశానికి పదేండ్లు ఒక దీప స్తంభంలాగా ఉన్న తెలంగాణ.. ఇవాళ కాంగ్రెస్ పరిపాలనలో దశాదిశా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘420 హామీలు, ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు అన్నరు.. బాండ్ పేపర్లు ఇచ్చిన్రు.. మూడు నెలల తర్వాత పథకాల వరద పారుతుందని హామీలు ఇచ్చిన్రు.. కానీ ఇవాళ బూతుల బురద మాత్రమే ఉన్నది. రేవంత్‌రెడ్డి నోరు తెరిస్తే బూతుల బురద తప్ప ఏమీ లేదు’ అంటూ కేటీఆర్ నిప్పులుచెరిగారు.
శ్రీరాముడో, శ్రీకృష్ణుడో ఆదర్శమని ఏ నాయకుడైనా చెబుతారని సీఎం రేవంత్‌రెడ్డికి మాత్రం హిట్లర్ ఆదర్శమంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. హిట్లర్ అభిమాని రైతులను ఏడిపించేలా పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. ‘ప్రపంచ నియంత హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకొనే వారికి ఏమి చెపుతాం? ఏమి అడుగుతాం? తెలంగాణలో దిగజారిన రాజకీయం, తీవ్రమైన దాష్టీకం జరుగుతున్నది. రైతు బీమా కట్టడం లేదు. 7,600 మంది రైతులకు రైతుబీమా ఇచ్చే పరిస్థితి లేదు. కరెంటు సకగ రావడం లేదు. పంట కొనుగోళ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నది’ అని నిప్పులుచెరిగారు. రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తం వడ్లు కొనాలని, కేంద్రం చెప్పినంతనే కొంటే బ్రోకర్ పనిచేసినట్టేనని మాట్లాడిండు. ఇటీవలి క్యాబినెట్ మీటింగ్‌లో మోదీ చెప్పినంతనే వడ్లు కొంటమని అంటున్నడు. రేవంత్‌రెడ్డి ఇస్తామని చెప్పిన బోనస్ అంతా బోగస్ అయ్యింది. వడ్లు, మకలు కొనుడు లేదు. ప్రధాని మోదీ ఎంత కొనుమని చెబితే అంతే కొంటా అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎందుకు? అని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో చేసిన అప్పులతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేశామని, అభివృద్ధి పనులను పూర్తి చేశామని.. కాంగ్రెస్ హయాంలో చేసిన అప్పులతో ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం వల్లనే ఇప్పుడు పథకాలు అమలు చేయ డం లేని సీఎం, మంత్రులు అంటున్నరు. పరిపాలన చేతగాక, ప్రభుత్వాన్ని నడిపే దమ్ము లేక, పథకాలను అమలుచేసే తెలివి లేక కేసీఆర్‌ను బదనాం చేయాలని చూస్తున్నరు. కేసీఆర్ హయాంలో రూ.2.80 లక్షల కోట్లు అప్పు చేశాం. అందులో 11సార్లు రైతు బంధు రూపంలో 70లక్షల రైతుల బ్యాంకు ఖాతా ల్లో రూ.73 వేల కోట్లు జమ చేసినం. రెండుసార్లు రూ.29 వేల కోట్ల రుణమాఫీ చేసినం. రైతుల కరెంటు కోసం లక్షా 50వేల కోట్లు ఖర్చు చేసినం. రూ.లక్ష కోట్లతో కేసీఆర్ కాళేశ్వరం కట్టి 40లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినం. కేసీఆర్ పదేండ్లలో రూ.2.80లక్షల కోట్ల అప్పు చేస్తే రెండున్నరేండ్ల కాం గ్రెస్ పాలనలో తెచ్చిన రూ.4లక్షల కోట్లతో ఏం చేశా రో రేవంత్ చెప్పాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో చేనేత కార్మికల వలసలను ఆపేందుకు, యువతకు ఉద్యోగాల కోసం కేసీఆర్ హయాంలో వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ‘కేసీఆర్ హయాంలో 1.62 లక్షల ఉద్యోగాలు, 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినం. మిగిలిన వాటిపై కాంగ్రెస్ కోర్టుకు వెళ్లడంతో ఆగిపోయాయి’ అని పేర్కొన్నారు. ‘నా చిన్న ప్రయత్నంతో కిటెక్స్ కంపెనీ రూ.3,700 కోట్లతో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టింది. టెక్స్టైల్ పారులో పరిశ్రమను ఏర్పాటు చేసింది. కొరియాకు చెందిన యంగ్వన్ పరిశ్రమను గుజరాత్ నుంచి తీ సుకొచ్చినం’ అని కేటీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్కు కార్యకర్తలే పట్టుగొమ్మలని, వచ్చే ఐ దేండ్ల పాలనలో వారి అభ్యున్నతికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. రెండున్నరేండ్లు ఎన్నో ఇబ్బందులకు ఓర్చి నిలబడ్డ కార్యకర్తల స్ఫూర్తి గొప్పది. గట్టిగా పని చేయాలి. రెండేండ్లలో గులాబీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ సీఎం అవుతాడు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నేపథ్యం, ఉద్యమం, సిద్ధాంతంపై ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పద్యాలు, పాటలతో కూడిన తనదైన శైలి ప్రసంగాన్ని అందరూ ఆసక్తిగా విన్నారు. సమావేశంలో తాటికొండ రాజయ్య, సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, కే వాసుదేవరెడ్డి, వై సతీశ్‌రెడ్డి, ఎం సుధీర్‌కుమార్, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మసూద్, లలితాయాదవ్, తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి సంచులు మోసి ముఖ్యమంత్రి పదవిని రెన్యువల్ చేసుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. సీఎంగా 30 నెలలైనా సాధించింది ఎకే విమానం.. దిగే విమానం. ఇప్పటికే 73 సార్లు ఢిల్లీకి పోయిండు. కనీసం వంద పైసలు తెచ్చినవా? ఢిల్లీకి ఇచ్చుడు తప్ప తెచ్చుడు లేదు’ అని వ్యాఖ్యనించారు. కొనుగోలు కేంద్రాల్లో సంచులు, బార్దాన్, సుతిల్, కాంటాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నరు. రేవంత్‌రెడ్డి మాత్రం సంచుల్లో నింపుకొని నెలకోసారి ఢిల్లీకి పోయి కప్పం కట్టి సామంతరాజు పదవిని రెన్యువల్ చేయించుకొని రావాల్సి వస్తున్నది. కేసీఆర్ పేదవాళ్లను చూసుకొంటే రేవంత్‌రెడ్డి పెద్దవాళ్లను అరుసుకుంటున్నడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు ఏం లాభం జరిగింది? ప్రజలకు జరిగిన మేలు ఏమిటో ఆలోచించాలి. మూడుసార్లు రైతు బంధు ఎగ్గొట్టినప్పుడు మిమ్మల్ని ఏమనాలె. కేసీఆర్ పాలనలో ఆటో అన్నకు ఫోన్ కొడితే పొలం కాడికి యూరియా వచ్చేది. మళ్లీ ఇప్పుడు యూరియా కోసం లైన్లలో నిలబడే రోజులు వచ్చినయ్’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
సర్ ప్రక్రియతో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉంటూ ఓట్లను కాపాడాలి. కేంద్రం చెప్పిన పం టలను మాత్రమే కొంటామని రేవంత్‌రెడ్డి క్యాబినెట్ దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నది. ఏడు రకాల స న్నాలను మాత్రమే వేయాలని ప్రభుత్వం చె బుతున్నది. దీంతో రైతులకు నష్టం వస్తుం ది. సారాన్ని బట్టి ఇష్టమైన పంటలను వేసుకోవాలి. 2024లో రైతుబంధు ఎగ్గొట్టి 2025లో మూడెకరాలకు మాత్రమే ఇచ్చి, 2026లో రెండు ఎకరాలకు మాత్రమే చెల్లించారు. కేసీఆర్ 11 విడుతల్లో రూ.72 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి రూ.29 వేల కోట్లు కూడా వేయలేదు. ఏడాదికి రెండు విడుతలు కాకుండా ఒకే విడుత ఇస్తామని ఇటీవల ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది. వ్యవసాయ రంగంలో కలిగే నష్టాలపై ప్రభుత్వాన్ని రైతు లు ప్రశ్నించాలి.
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే
తెలంగాణ అభివృద్ధిపై విజన్ ఉన్న నేత కేసీఆర్. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తె లంగాణలో ఇప్పుడు ని ధులు ఢిల్లీకి, నదులు ఆంధ్రాకు వెళ్తున్నాయి. నియామకాలు లేకుండా భయానకాలు ఏర్పడుతున్నాయి. రాష్ర్టాభివృద్ధిపై గొప్ప విజన్, ఆలోచనతో ఉన్నామన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు ఒక్క పథకాన్ని కూడా రూపొందించలేదు. ప్రజలకు మోసపోవడం అలవాటు.. మాకు మోసం చేయడం అలవాటు అని ప్రకటించుకున్న ఏకైక నాయకుడు రేవంత్‌రెడ్డి. కేసీఆర్ ప ట్టాలు ఇచ్చి ఇండ్లు నిర్మిస్తే కాంగ్రెస్ సర్కార్ కూల్చివేతలు చేపడుతున్నది. రేవంత్‌రెడ్డి దిగజారిన భాష మాట్లాడుతున్నరు. కేసీఆర్.. రైతు బతుకు బాగు కోసం చెరువులు బాగు చేసే మిషన్ కాకతీయ అని పేరు పెట్టారు. కరోనా లాక్‌డౌన్‌లోనూ రైతుల ఖాతాల్లో రూ.76 వేల కోట్ల నిధులు జమ చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. రైతుల ఇంటి ముందుకొచ్చి చేరే ఎరువులు, ఇప్పుడు వాటి కోసం నానా తిప్పలు పడాల్సి వస్తున్నది.
– దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ
వర్ధన్నపేట నియోజకవర్గంలో ‘కేసీఆర్ రావాలి.. కాంగ్రెస్ పోవాలి’ అనే నినాదంతో ముందుకు వెళ్తు న్నం. కొట్లాడి నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేసిన. నియోజకవర్గంలోని ప్రతి దళితకాలనీ, వాడలను అభివృద్ధి చేసి న. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు నిర్మించిన. మంత్రులతో పోటీపడి అనేక నిధులను తీసుకొచ్చి నిబద్ధతతో పనిచేసిన. పదేండ్ల కాలంలో సంక్షేమం కోసం నియోజకవర్గానికి రూ.2 వేల కోట్లకుపైగా నిధులు తెచ్చిన. ఇప్పుడు నియోజకవర్గంలో డివిజన్‌కో ఎమ్మెల్యే ఉన్నడు. ఎమ్మెల్యే కొడుకు కూడా బాసే. కాంగ్రెస్ ఏజెంట్‌కు తెలియకుండా రైతు పొలం నుంచి మొరం తరలించినా కేసులు పెడతున్నరు. కార్యకర్తలపై కేసులు పెట్టి పీడిస్తే పోలీస్స్టేషన్లను ముట్టడిస్తాం. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులే ఇప్పుడు జరుగుతున్నాయి.
– అరూరి రమేశ్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వయ సు పెరుగడంతో మతి త ప్పి మాట్లాడుతున్నడు. గ తంలో నర్సంపేట ప్రజలు తరిమికొడితే పరకాలకు వచ్చిన రేవూరి అదృష్టంకొద్దీ ఎమ్మెల్యే అయ్యిం డు. ఇప్పుడు ఇక్కడి ప్రజలు కూడా తరిమికొట్టేందుకు సిద్ధమయ్యారు. మళ్లీ ఎమ్మెల్యేగా గెలువడని వసూళ్లు చేస్తున్నడు. టెక్స్టైల్ పార్క్‌లో లక్ష ఉద్యోగాలు వస్తాయనే ఆలోచనతో నియోజకవర్గ ఆడబిడ్డలకు ముందస్తుగా కుట్టులో శిక్షణ ఇస్తున్నం. పరకాల, నడికూడ మండలాల్లో చల్లా ధర్మారెడ్డితో కలిసి కుట్టుశిక్షణ శిబిరాలను సందర్శిస్తే కడుపు మండిన రేవూరి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నడు. టెక్స్టైల్ పార్క్‌లో రేవూరి అక్రమాలను అడ్డుకున్నందుకే కక్షగట్టిండు. గతంలో రేవూరి.. టెక్స్టైల్ పార్కులో రూ.125 కోట్ల పనులను తప్పుడు జీవోతో రూ.2,150 కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నడు. ఈ విషయాన్ని కేటీఆర్ సహాయంతో అడ్డుకోవడంతో రూ.25 కోట్ల కమీషన్ పోయిందనే అక్కసుతో మతిలేని మాటలు మాట్లాడుతున్నడు.
– పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి దేశానికే మార్గదర్శకంగా తీర్చిదిద్దారు. దొంగ హామీలు, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి రాష్ర్టాన్ని ఆగం చేస్తున్నడు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నరు. ఒక్క హామీ కూడా అమలు కాలేదు. చివరకు రైతులు పండించిన పంట అమ్ముకునేందు కు కూడా ఇబ్బంది పడుతున్నరు. ప్రశ్నించే బీఆర్ఎస్ కార్యకర్తలపై కుట్రలు చేసి అక్రమ కేసులు బనాయిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నరు. రైతులు పండించిన పంట కొనే సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. రైతుల ఏడుపుతోనే కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నరు. రానున్నవి మంచి రోజులే.
– చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పరకాల
హనుమకొండ జిల్లా దామెరలో నిర్వహించిన పరకాల నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతున్న పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేండ్లు దేశానికి ఒక దీపస్తంభం లాగా ఉన్న తెలంగాణ.. ఇవాళ కాంగ్రెస్ పాలనలో దశాదిశ లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు 420 హామీలు, ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు అన్నరు. బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. మూడు నెలల తర్వాత పథకాల వరద పారుతుందని ఊదరగొట్టిండ్రు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి నోరు తెరిస్తే బూతు బురద తప్ప… ఏ పథకాల వరద పారట్లేదు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఎటు గాయబ్ అయినయ్? కొత్తవి ఇయ్యకపోగా, ఉన్న పథకాలనూ ఊడగొట్టిండ్రు.
-కేటీఆర్
మోసకారి కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఇదే నినాదం మార్మోగుతున్నది. కార్యకర్తల సమావేశాల్లో మునుపెన్నడూ లేనంత ఉత్సాహం కనిపిస్తున్నది. పరిస్థితి చూస్తుంటే గెలుపు బీఆర్ఎస్ తలుపులు తడుతుందనేది స్పష్టంగా కనిపిస్తున్నది.ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు..పాలేరు నుంచి జహీరాబాద్ వరకు అంతటా గులాబీ జెండా ఎగురడం ఖాయం.
– కేటీఆర్
కేసీఆర్ పేదవాళ్లను మంచిగ చూసుకొంటే.. రేవంత్‌రెడ్డి పెద్దవాళ్లను అర్సుకుంటున్నరు. ఇక్కడ కమీషన్లు దండుకొని ఢిల్లీకి కప్పం
కడుతున్నరు. హామీలపై నిలదీస్తే కేసీఆర్‌ను బదనాం చేస్తున్నరు. కుర్చీ మడతపెట్టి రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి. రేవంత్ మాజీ సీఎం అయిన తర్వాత కూసున్న కుక్క కూడా లేవదు.
– కేటీఆర్