KTR | హైదరాబాద్, జనవరి19 (నమస్తే తెలంగాణ) : రాజకీయంగా ఎదుర్కోలేక, పాతకేసులతో ఇబ్బందిపెట్టాలని చూస్తున్న రేవంత్‌రెడ్డిని ఎట్టిపరిస్థితుల్లో వదలబోమని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల కోసం ఎంతదూరమైనా వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమం మొదలు ఇప్పటి వరకు ప్రజల కష్టాల్లో తోడుంటున్న నాయకుడు హరీశ్రావని, అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన చూపిస్తున్న తెగువను తట్టుకోలేక ముఖ్యమంత్రి వెన్నులో వణుకు పుట్టిందని దుయ్యబట్టారు. 24 నెలలుగా రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే కక్ష సాధింపుచర్యలకు దిగుతున్నారని, చట్టం, న్యాయస్థానాలపై తమకు పూర్తి గౌరవం, నమ్మకం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల పక్షాన రేవంత్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని, సర్కార్ తప్పుడు విధానాలు ఎండగట్టి తీరుతామని ఈ క్రమంలో తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా విచారణకు సిద్ధమని ప్రకటించారు. నోటీసులతో ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూడటం ప్రభుత్వ పెద్దల అవివేకానికి నిదర్శమని, చౌకబారు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
దృష్టి మరల్చేందుకే ప్రయత్నాలు
సీఎం బామ్మర్ది సృజన్‌రెడ్డికి సంబంధించిన బొగ్గు కుంభకోణం బయటపడటంతోనే, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపారని కేటీఆర్ ధ్వజమెత్తారు. అందులో భాగంగా సుప్రీంకోర్టు కొట్టేసిన ఫోన్ ట్యాపింగ్ అంశంలో మళ్లీ మాజీమంత్రి హరీశ్‌రావుకు నోటీసులిచ్చి అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. రాజకీయ వేధింపులే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య మాత్రమేనని సాక్షాత్తూ సుప్రీంకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పిందని కేటీఆర్ గుర్తుచేశారు.
అత్యున్నత న్యాయస్థానమే కేసును కొట్టేసి, పొలిటికల్ డ్రామాకు తెరదించినా మళ్లీ మాజీ మంత్రి హరీశ్‌రావుకు నోటీసులివ్వడం చూస్తుంటే రేవంత్‌రెడ్డి సరార్ ఎంత దిగజారిందో అర్థమవుతున్నదని మండిపడ్డారు. అసలు నోటీసుల వెనుకనున్న కారణం ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిది సూదిని సృజన్‌రెడ్డికి అడ్డగోలుగా జరిగిన బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టామని, భారీ సామ్ నుంచి తప్పించుకోవడానికే రాత్రికి రాత్రే హరీశ్‌రావుకు నోటీసులు పంపారని కేటీఆర్ వివరించారు. ఇది పకాగా రేవంత్‌రెడ్డి మార్ డైవర్షన్ పాలిటిక్స్ అని ఎద్దేవా చేశారు. అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి ప్రతిపక్ష నేతలపై బురద చల్లడం, నోటీసులతో బెదిరించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.