హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): విధ్వంసం, పరధ్యానం, పాథలాజికల్ అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్‌రెడ్డి నిపుణుడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలంటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అర్థంలేని కక్ష గట్టి రైతులకు నీళ్లివ్వకుండా రేవంత్‌రెడ్డి అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఉరిశిక్ష విధించి దాన్ని పూర్తి చేయకుండా తన ప్రాంత రైతులకే సీఎం అన్యాయం చేస్తున్నారని ఆదివారం ఎక్స్‌వేదికగా విమర్శించారు. కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటాపై నోరు తెరవకుండా పాలమూరు ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు ద్వారా వందల టీఎంసీల నీటిని ఆంధ్రాకు తరలిస్తున్నా పట్టించుకోవడంలేదని తెలిపారు. కాళేశ్వరం నుంచి అదనపు టీఎంసీని తరలించేందుకు కేంద్రం ఆంక్షలు విధించినా కాంగ్రెస్ సర్కార్‌లో చలనం లేకుండా పోయిందని, నాడు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కరవు తాండవిస్తే.. నేటి ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరువు పోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రుణమాఫీపై సవాల్‌కు తోకముడిచిన ప్రభుత్వం
‘అధికారం ఉన్నదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తే నిజమవుతయా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ కాలేదని రైతులు ఇంకా రోడ్డెక్కుతున్నారని వాపోయారు. వందశాతం రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరితే స్వీకరించకుండా ప్రభుత్వ పెద్దలు తోకముడిచారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ కాని అన్నదాతలకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో మాఫీ జరిగితే రైతులు ధర్నాలు చేయాల్సిన ఖర్మ ఏంటని ప్రశ్నించారు. ‘పోరాటాల గడ్డ ఇంద్రవెల్లి.. అడవుల తల్లి ఆదిలాబాద్.. ధనోరా రోడ్డు మీద కూర్చున్న రైతుల ముందే మీ మాయల మాఫీ లెక్కలు తేలుద్దాం పద’ అని సవాల్ విసిరారు. ధర్నా చేస్తున్న ఫొటో క్లిప్పింగ్‌ను తన పోస్ట్‌కు జత చేశారు. ‘రుణమాఫీ మాయ, రైతు భరోసా మాయ, తులం బంగారం మాయ, మహిళలకు 2500, 4000 ఆసరా పింఛన్లు, దివ్యాంగులకు 6000 పింఛన్లు మాయ’ అంటూ సెటైర్లు విసిరారు.