హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తేతెలంగాణ): ‘అర్హులందరికీ అక్రెడిటేషన్లు ఇచ్చి, ఇండ్ల స్థలాలను కేటాయిస్తామని జర్నలిస్టులకు హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి..ఇప్పుడు తొలగింపునకు పూనుకోవడం దుర్మార్గం..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. హక్కులు అడిగిన జర్నలిస్టులపై నిర్బంధం ప్రయోగించడం కాంగ్రెస్ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజల గొంతుకైన జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపడాన్ని శనివారం ఎక్స్ వేదికగా ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి, ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
హక్కులడిగిన జర్నలిస్టులపై దమనకాండకు దిగడమే ఏడో గ్యారెంటీనా? అని ప్రశ్నించారు. జర్నలిస్టుల ఆకాంక్షలకు విరుద్ధంగా జారీ చేసిన జీవో 252ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై శాంతియుతంగా వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన టీయూడబ్ల్యూజే, టీజేఎఫ్ నేతలను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం సర్కారు ఫాసిస్టు విధానాలకు అద్దం పడుతున్నదని తూర్పారబట్టారు. ప్రభుత్వ చర్య జర్నలిస్టు నేతల అరెస్ట్ మాత్రమే కాదని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను పోలీసు బలగాలతో నొక్కేసే కుట్ర అని నిప్పులుచెరిగారు.
ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే..
కొత్త జీవో సాకుతో జర్నలిస్టుల అక్రెడిటేషన్లలో కోతలు విధించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వారి ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు.అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకే ఆరు గ్యారెంటీలు, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఏడో గ్యారెంటీ అంటూ గారడి మాటలు చెప్పిందని విమర్శించారు. ప్రజాసమస్యల పరిష్కారానికి అలుపెరుగకుండా శ్రమించే జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్లు ఇవ్వకుండా కోత పెట్టి వారి ఉపాధి అవకాశాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నదని మండిపడ్డారు.
న్యాయం చేయాలని అడిగిన జర్నలిస్టులు మారుతీసాగర్, రమేశ్ హజారే, యోగానంద్, విష్ణువర్ధన్‌రెడ్డి, రమణకుమార్, కడకంచి వెంకట్‌ను అరెస్ట్ చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. జర్నలిస్టు నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని స్పష్టంచేశారు. జర్నలిస్టుల ఆకాంక్షలకు విరుద్ధంగా విడుదల చేసిన జీవో 252ను రద్దు చేయాలని డిమాడ్ చేశారు. అక్రెడిటేషన్ల పునరుద్ధరణ కోసం జర్నలిస్టులు సాగించే పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.