KTR | న్యూఢిల్లీ : ఈవీఎంలపై దేశ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని, వాటి పట్ల ప్రజలు విశ్వసనీయతను కోల్పోయారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం అనంతరం కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
ఇవాళ ఈసీ ముందు ఆరేడు విషయాలు కుండబద్దలు కొట్టినట్టు మా పార్టీ అభిప్రాయం చెప్పాం. అందులో ఒకటి ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు అమెరికా లాంటి దేశాలు కానీ, యూకే, జర్మనీ, ఇటలీ కానీ, ఇంకా చాలా దేశాలు కొంతకాలం వరకు ఈవీఎంలను ప్రయోగాత్మకంగా అమలు చేసినప్పటికీ, ప్రజల్లో వాటిపై విశ్వాసం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఈవీఎంలను రద్దు చేసి పేపర్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో దాదాపు 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇలాంటి దేశంలో ఈవీఎంల వల్ల నష్టం జరుగుతున్నది. మేం వేసిన వారికి ఓటు పడడం లేదని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో ఈవీఎంలను పక్కనపెట్టి, పేపర్ బ్యాలెట్లను తేవాలని మా పార్టీ తరపున ఎన్నికల కమిషన్‌ను కోరాం. పేపర్ బ్యాలెట్ విధానాన్ని నవంబర్‌లో జరిగే బీహార్ ఎన్నికల్లో అమలు చేయాలని కోరాం. ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ పేపర్ బ్యాలెట్ విధానం అమలు చేయాలని మా పార్టీ తరపున కుండబద్దలు కొట్టినట్టు మా పార్టీ అభిప్రాయం చెప్పామని కేటీఆర్ తెలిపారు.
ఎన్నికల సమయంలో పార్టీలు ఇచ్చే అడ్డగోలు హామీలు, తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇష్టమొచ్చినట్టు 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి గెలిచింది. ఈ విషయాలన్నీంటిని ఈసీకి వివరంగా చెప్పాం. ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోకి రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండకపోతే తప్పకుండా ఆ పార్టీని శిక్షించాల్సిన బాధ్యత కూడా ఈసీ మీద ఉంది. ఎన్నికల్లో ప్రజలను వంచించే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చాక మోసం చేస్తే సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా, ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హులుగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇండియాలో ఎన్నికల సంస్కరణలు రావాలి. ప్రజలను ప్రలోభ పెట్టుడుతున్న పార్టీలు, వంచిస్తున్న విషయాలపై చర్చ జరిగిందని కేటీఆర్ తెలిపారు.
20 ఏండ్లుగా ఒక అంశంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. కారు గుర్తును పోలిన సింబల్స్ దాదాపు 9 వరకు ఉన్నాయి. ఉదాహరణకు 2019 ఎన్నికల్లో భువనగిరిలో 5 వేల ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలిచారు. తమ పార్టీ తరపున పోటీ చేసిన బూర నర్సయ్య ఓడిపోయారు. కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్‌కు 27 వేల ఓట్లు వచ్చాయి. ఇలా ఎన్నో సందర్భాల్లో మా పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో 14 స్థానాల్లో 6 వేల కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం. కారు గుర్తును పోలిన గుర్తుల వల్లే నష్టం జరిగింది. ఈ సింబల్స్‌ను తొలగించాలని కోరాం. ఎన్నికల కమిషన్ రాష్ట్రాల్లో పర్యటించాలి. ప్రజలతో ఇంటరాక్షన్ అవ్వాలి అని కోరాం. సంస్కరణలు తీసుకురావాలని వివరంగా చెప్పాం. అన్ని సానుకూలంగా విన్నారు. ఈవీఎం ఓటింగ్ ప్రక్రియలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరాం. ఈవీఎంలను తొలగించాలని నొక్కి చెప్పామని కేటీఆర్ స్పష్టం చేశారు.