హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భారత సైన్యంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆర్మీకి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మన సైనికులు సరిహద్దుల్లో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేశానికి కాపాలా కాస్తున్నారని, అందుకే మనం సురక్షితంగా ఉన్నామని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కానీ రేవంత్‌రెడ్డి తన రాజకీయాల కోసం సైన్యాన్ని అవమానించడం దురదృష్టకరమని ధ్వజమెత్తారు. భారత సైన్యాన్ని కించపరిచి, శత్రుదేశానికి వంతపాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. డబ్బు సంచులతో దొరికిన రేవంత్‌రెడ్డికి… గూండాలు, రౌడీషీటర్లు అంటేనే గౌరవమని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి.. శత్రుదేశాన్ని గౌరవించడంలో ఆశ్చర్యమేమీలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకైనా మర్యాదగా ప్రవర్తించాలని హితవుపలికారు.
కాంగ్రెస్ పాలనలో రౌడీరాజ్యం
రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో రౌడీరాజ్యం నడుస్తున్నదని, గూండాలు రెచ్చిపోతున్నారని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ మణుగూరు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటన జరిగిన వెంటనే పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుతో ఫోన్లో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. 60 లక్షల సభ్యులు గల బీఆర్ఎస్ కుటుంబం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కాంగ్రెస్ అరాచకత్వానికి భయపడాల్సిన అవసరంలేదని స్పష్టంచేశారు. ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.