KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పడం మానెయ్యాలని, వరదలతో చనిపోయిన వారి సంఖ్య ను తక్కువ చూపించడం సీఎంకు సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వరదలతో చనిపోయిన వారి పూర్తి జాబితాను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నిన్న 16 మందే చనిపోయారని సీఎం ప్రకటించారని, ఈ జాబితాను తనిఖీ చేసి అన్ని కుటుంబాలకు సాయం చేయాలని సూచించారు.
‘చావు లెక్కలపై అబద్ధాలు చెప్తున్న మిమ్మల్ని ఎవ్వరూ క్షమించరు’ అంటూ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సిగ్గుమాలిన రాజకీయాలకు తెరదించి, ఆ కుటుంబాలను క్షమాపణ అడగాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసిన విధంగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున అందించాలని గుర్తుచేశారు.
పోలీసులకు అభినందనలు
భారీ వర్షాలతో అచ్చంపేటలోని డిండి కెనాల్లో చికుకుపోయిన 10 మంది గిరిజనులను కాపాడిన పోలీసులను కేటీఆర్ అభినందించారు. మూడు రోజుల క్రితం వరదల్లో చికుకుపోయారని, సమయానికి హెలికాప్టర్లు పంపి ఉంటే వారంతా బయటపడి ఉండేవారని, కానీ, సీఎం ఎలాంటి ప్రయత్నం చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ వస్తే కరెంటు ఉండదని ఎన్నికల ముందు నుంచే చెప్తున్నామని ఇప్పుడు పత్రికలు చెబుతున్నాయని కేటీఆర్ దుయ్యబట్టారు. ‘కరెంటు కావాలా?, కాంగ్రెస్ కావాలా? అని ఆనాడే అడిగినం, కాంగ్రెస్‌కు అధికారం, రాష్ట్రంలో అంధకారం’ అంటూ ఎక్స్‌లో సెటైర్ వేశారు.
వర్షాలు, వరదలతో 48 గంటల పాటు కరెంటు పోయిందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్‌చేశారు. కేసీఆర్ హయాంలోనే చేపట్టిన ఎస్ఎన్డీపీ వల్ల ఓల్డ్ సిటీలో వరద ముంపు తప్పిందని తెలిపారు. ప్రభుత్వాలు చేస్తున్న ‘బుల్డోజర్ పాలిటిక్స్’ ప్రజల జీవితాలపై దాడి అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇదే సందర్భంలో సుప్రీం వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తున్నదని ఎద్దేవా చేశారు. ఓవైపు బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధమంటూ రాహుల్ పెద్దపెద్ద మాటలు చెప్తుంటారని, అదే తెలంగాణలో తమ పార్టీ పాలనలో బుల్డోజర్తో జరుగుతున్న విధ్వంసంపై మౌనంగా ఉంటారని, ఇదేం ద్వంద్వ వైఖరి అని రాహుల్‌ను నిలదీశారు.