KTR | హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఎంత దరిద్రంగా ఉంటదో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్‌రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహి పెడితే అంతే దారుణంగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ తల్లి అంటే తెలంగాణ జాతి అస్థిత్వానికి ప్రతీక, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ఎలా ఆ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠారని ప్రశ్నించారు. రుణమాఫీ విషయంలో గురువారం నాటి ధర్నాలు మొదటి స్టెప్ మాత్రమేనని, రెండోస్టెప్లో ప్రతి గ్రామం వెళ్తామని, రిలే దీక్షలు చేస్తామని, రుణమాఫీ అయ్యేవరకు వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఉద్యమకాలంనాటి నిరసనలు మళ్లీ చేస్తామని స్పష్టంచేశారు. గురువారం చేవెళ్లలో కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రుణమాఫీపై తదుపరి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ ఏయే ప్రాంతాల్లో సమావేశాలు పెట్టిందో వాటిని అమలు చేయాలంటూ ఆ ప్రాంతాల్లోనే సెప్టెంబర్‌లో బీఆర్ఎస్ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల అమలుపై కూడా బీఆర్ఎస్ పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. రుణమాఫీ పేరుతో ఎన్నో మీటింగ్‌లు పెట్టి ఇన్ని నెలల తమాషా తర్వాత రైతుబంధు మూడు విడతల్లో రూ.7,500 కోట్లు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతుంటే మంత్రులు ఇరుక్కుపోతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రం అప్పులపైనా రేవంత్‌రెడ్డి సరార్ అసత్యాలు, దుష్ప్రచారాలు చేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. జీతభత్యాలు, పెన్షన్లు, అప్పులకు మిత్తీలు లాంటి కచ్చితమైన ఖర్చులుపోనూ రాష్ట్ర రెవెన్యూ మిగులు బడ్జెట్లోనే ఉన్నదని తెలిపారు. 2014లో రూ.370 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటే, 2023లో రూ.5,900 కోట్లు సర్‌ప్లస్‌గా వారికి ఇచ్చామని వెల్లడించారు. చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం సీఎం, మంత్రులు అప్పులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం ప్రజాఅంశాల నుంచి దృష్టి మరల్చేందుకే రేవంత్‌రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘రైతు రుణమాఫీపై అబద్ధాలు చెప్పినందుకు ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి. ఆగస్టు15లోగా ఎలాగూ రుణమాఫీ చేయలేదు. కనీసం ఎప్పటిలోగా చేస్తారో అదైనా చెప్పాలి. రైతు భరోసాను ఎప్పటిలోగా రైతుల ఖాతాలో వేస్తారో కూడా చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. విత్తనాల నుంచి మొదలుకొని యూరియా, ఎరువులు, విద్యుత్తు వరకు అన్నింటా రైతులు ఇబ్బందులు ఎదురొంటున్నారని తెలిపారు.
రాహుల్‌గాంధీకి, రేవంత్‌రెడ్డికి మధ్య అదానీతోపాటు అనేక అంశాలపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. అదానీ అక్రమాలపై రాహుల్ మాట్లాడితే, రేవంత్‌రెడ్డి అదానీతో ఒప్పందాలు చేసుకొంటున్నారని తెలిపారు. అదానీ సంస్థల అక్రమాలపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని తాము ముందు నుంచీ డిమాండ్ చేస్తున్నామని గుర్తుచేశారు. పదేండ్లపాటు తమ మెడమీద కత్తిపెట్టినా అదానీ కంపెనీని రాష్ట్రంలోకి రానివ్వలేదని చెప్పారు. అదానీ విద్యుత్తు మీటర్లను, అదానీ బొగ్గును తెలంగాణలోకి రానియ్యలేదని, కానీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, తెలంగాణలో అదానీ వ్యాపారాలు చేస్తున్నారని వివరించారు. రూ.12,400 కోట్ల మేరకు అదానీతో పెట్టుబడులకు సంబంధించి రేవంత్‌రెడ్డి ఎంవోయూ కుదుర్చుకున్నారని పేర్కొన్నారు. అసలు అదానీ మంచివాడా? చెడ్డవాడా? అనే విషయాన్ని రాహుల్, రేవంత్‌రెడ్డి కూర్చొని తేల్చుకొని అభిప్రాయం చెప్పాలని చురక అంటించారు.
అద్భుతంగా కట్టుకున్న సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలన్నదని తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా, ‘రాహుల్‌గాంధీ అయ్య విగ్రహం పెట్టి రాహుల్‌గాంధీ దగ్గర మారులు కొట్టేయాలని రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని నేను కూడా అనవచ్చు. రేవంత్ తన పార్టీ నాయకుల దగ్గర మారులు వేయించుకోవడానికి తెలంగాణ జాతి మొత్తాన్ని అవమానిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి రేవంత్‌రెడ్డికి ఉన్న సమస్య ఏమిటి? రాష్ట్రంలో రాజీవ్‌గాంధీ విగ్రహాలు తక్కువయ్యాయా? గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఎంత దరిద్రంగా ఉంటదో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్‌రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహి పెడితే అంతే దారుణంగా ఉంటుంది. పదేండ్లలో మీరెందుకు పెట్టలేదంటే.. 10 సంవత్సరాల్లో నూతన సచివాలయం కట్టలేదన్న విషయం తెలివి తకువ రేవంత్‌రెడ్డికి తెలియదు. సచివాలయం ప్రారంభంకాగానే తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ప్రకటించాం. స్థలాన్ని కూడా కేటాయించాం’ అని వెల్లడించారు.
తాము అధికారంలో ఉన్నన్ని రోజులు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మార్చలేదని కేటీఆర్ గుర్తుచేశారు. అయితే, మళ్లీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నేతల పేర్లతో ఉన్న పథకాల పేరు మార్పును పరిశీలిస్తామని తెలిపారు. ఇదే అహంకారంతో మాట్లాడితే.. కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి పథకం పేరును కచ్చితంగా మారుస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి బానిసలు అని అభివర్ణించారు. 9 నెలల్లో రేవంత్‌రెడ్డి సాధించిన గొప్ప విజయం ఢిల్లీకి 20 సార్లు పోయిరావడమేనని ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్ గుర్తులను తుడిపేయాలని అంటే తెలంగాణ ఉండదు. తెలంగాణ లేకుండా చేసేందుకు రేవంత్‌రెడ్డి ఏదైనా కుట్ర చేస్తున్నాడేమో చూడాలి. తెలంగాణ అనే పేరును ఏమైనా మారుస్తాడేమో!’ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకొకటిగా అన్ని పదవులను తెలంగాణేతరులకు అప్పజెప్పుతున్నదని కేటీఆర్ ఆక్షేపించారు. రాజ్యసభకు ఎంపికయ్యే అర్హతలు ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరూ రాష్ట్రంలో లేరా? మన వీ హనుమంత్‌రావుకు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు కూడా తెలంగాణకు చెందిన వ్యక్తి కాదని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు వేరే ప్రాంత వ్యక్తి అభిషేక్ మనుసింఘ్వీని పంపారని తెలిపారు. మాదిగ సామాజికవర్గానికి రాజ్యసభ స్థానం ఇస్తామని మోసం చేసి సింఘ్వీకి చోటు కల్పించారని పేర్కొన్నారు. సింఘ్వీ తెలంగాణ కోసం కొట్లాడుతాడు అని సీఎం అంటే.. మరి తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు గాడిదలు కాస్తారా? అని నిలదీశారు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని అన్నారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేందుకు ప్రభుత్వం భయపడుతున్నదని కేటీఆర్ వెల్లడించారు. బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు. ఎన్నికలకు వెళ్లాలంటే ముందు బీసీ జనగణన చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందని తాము అనుకోవడం లేదని పేర్కొన్నారు.