KTR | బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ రెడ్డి చేసిన దారుణమైన మోసానికి శ్రీసాయి ఈశ్వర్ అనే యువకుడి నిండు ప్రాణం బలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీకి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడవడాన్ని తట్టుకోలేకే ఈశ్వర్ ఆత్మాహుతి చేసుకున్నాడని తెలిపారు.
పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కేవలం 17 శాతానికే కుదించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచారని కేటీఆర్ మండిపడ్డారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సాయి ఈశ్వర్ మరణానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కులగణనను మొదలుకుని న్యాయస్థానాల్లో నిలబడని జీవోల దాకా కాంగ్రెస్ ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కామారెడ్డి డిక్లరేషన్ కు సమాధి కట్టిందని కేటీఆర్ అన్నారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిఆమండ్ చేశారు.