Karra Srihari | బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి మృతి పట్ల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. నాలుగు దశాబ్దాల పాటు సర్పంచ్, పాక్స్ చైర్మన్, ఎంపీపీ, జడ్పీటీసీగా ఎన్నో పదవుల్లో ప్రజాసేవ చేస్తూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన, పారదర్శకతకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు.
కర్ర శ్రీహరి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కేటీఆర్ అన్నారు. నిజాయితీ, అంకితభావం, నిస్వార్థ సేవలతో ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడిగా కర్ర శ్రీహరి ఎప్పటికీ నిలిచిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి ఆయన మృతి తీరని లోటు అని కేటీఆర్ అన్నారు. కర్ర శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.