KTR | హైదరాబాద్ : చిట్‌చాట్ పేరుతో రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన అడ్డగోలు వ్యాఖ్యలు, ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మీడియా చిట్‌చాట్ పేరుతో నాపైన, ఇతరులపైన విషయం చిమ్మడం ఇదే మొదటిసారి కాదు. కేవలం ముఖ్యమంత్రి కార్యాలయానికి గౌరవం ఇచ్చి ఇప్పటివరకు సంయమనం పాటించాను అని కేటీఆర్ తెలిపారు.
డ్రగ్స్ కేసులో నాపై విచారణ జరుగుతుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి ఆధారం ఏమిటో చెప్పాలి. నాపైన ఏమైనా కేసు నమోదైందా? కనీసం అణువంత రుజువైనా ఉన్నదా? ముఖ్యమంత్రికి దమ్ముంటే దొంగ చాటుగా చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసురుతున్నాను. లేకుంటే తాను చేసింది చౌకబారు, చిల్లర వ్యాఖ్యలు అని ఒప్పుకోవాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో నాతో ముఖాముఖి చర్చకు వచ్చే దమ్ములేక ఢిల్లీ వరకు ప్రయాణం చేసి మరీ రేవంత్ రెడ్డి నాపై బురద జల్లుతున్నాడు. కేవలం చట్టం పరిధి నుంచి న్యాయస్థానాల పరిధి నుంచి తప్పించుకోవడానికే ముఖ్యమంత్రి చిట్‌చాట్‌ల పేరుతో దొంగచాటు మాటలు మాట్లాడుతున్నాడు. పిరికి దద్దమ్మలా చిట్‌చాట్‌ల పేరుతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడు. వీటన్నింటినీ ఇకపై సహించేది లేదు.. రేవంత్ రెడ్డి చేసిన అసత్యపూరిత, దురుద్దేశపూర్వక నిందలకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రేవంత్ తాను చేసిన నిరాధార ఆరోపణలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేదంటే పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని కేటీఆర్ హెచ్చరించారు.