పరిగి, జూన్ 26 : మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తానని ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని కోటీ 67లక్షల మంది ఆడబిడ్డలకు ఒక్కొక్కరి ఖాతాలో రూ.లక్షా 50వేలు వేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పరిగి వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. రేవంత్‌రెడ్డి మాటల్లో ఒక శాతం చిత్తశుద్ధి ఉన్నా కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు కనీసం లక్షాధికారులను చేయాలని సూచించారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి తులం ఇనుము కూడా ఇయ్యడని ఎద్దేవా చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీఎల్ఏలకు ఎస్ఐఆర్పై, పార్టీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ధర్మయుద్ధం జరుగాలని తాము కోరుకుంటు న్నామని కానీ కాంగ్రెస్, బీజేపీలు దొంగ మాటలు, దొంగ ఓట్లను నమ్ముకున్నాయని కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం దొంగ ఓట్లని, కాంగ్రెస్ వారు 15వేల దొంగ ఓట్లు రాయించారని ఆరోపించారు. మనం అప్రమత్తంగా లేకపోతే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ ఓటర్లను గల్లంతు చేస్తాయేమోననే అనుమానం ఉన్నదని, ఎస్ఐర్ ప్రక్రియలో బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమున్నదని సూచించారు.
నిజాయితీగా ఉన్న ఓటర్లతో మళ్లీ బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో పంటల సమయంలో రైతుబంధు వచ్చేదని, కాంగ్రెస్ హయాంలో ఓట్లప్పుడే రైతుబంధు వస్తుందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒకసారి, పంచాయతీ ఎన్నికలప్పుడు ఒకసారి రైతుబంధు ఇచ్చారని, మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారని దుయ్యబట్టారు. కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసినా, వెంటనే బ్యాంకుకు పోయి రూ.2లక్షలు తెచ్చుకోండి తాను మాఫీ చేస్తానని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని మండిపడ్డారు. ఇలా ఏ ఒక్క హామీ కూడా రేవంత్ సర్కార్ నెరవేర్చలేదని నిప్పులుచెరిగారు. 420 హామీలిచ్చి కాంగ్రెస్ ఓట్లు వేయించుకున్నదని, రైతుబంధు రెండు పంటలకేనా మూడవ పంటకు ఇయ్యరా? అని ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి ఇవాళ కనీసం రైతుబంధు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని నిలదీశారు. అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం, అమ్ముకోండి, ఖుషీగా పిల్లలకు ఇచ్చుకోండని చెప్పిన రేవంత్ ఇవాళ పరిగిలో భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు. చేవెళ్లలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో దళితులు, గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి కోసం పనిచేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలను 100రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ 30 నెలల్లో కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్, నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి ఎం ఎన్ శ్రీనివాస్‌రావు, సీనియర్ నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.