Telangana Thalli | కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడ తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. మేడ్చల్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘ప్రభుత్వం చేసిన అపచారానికి తప్పకుండా రీతిలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ వేదిక ద్వారా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ.. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుడికి, ప్రతి ఒక్క ఉద్యమ బిడ్డకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనం రెండు పనులు చేద్దాం. ఖచ్చితంగా తెలంగాణ తల్లిని 2007లో ఏ తల్లి అయితే ఉద్యమంలో నుంచి ఉద్భవించిందో.. సోషల్ మీడియా, వాట్సాప్ డీపీల్లో తెలంగాణ తల్లి డీపీగా పెట్టుకుందాం.. ఎవడు ఏం పీకుతడో చూద్దాం అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ.. ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయో.. అక్కడ రేపటి రోజున.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా పాలాభిషేకాలు చేద్దాం. అవసరమైతే పంచామృతాభిషేకాలు చేద్దాం.. జరిగిన తప్పుకు క్షమాపణలు అడుగుదాం.. ఈ కాంగ్రెస్ మూర్ఖులకు చరిత్ర తెలియదు.. ఈ సన్నాసులను క్షమించమని కోరుదాం’ అన్నారు.
‘ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నయ్. మచ్చుకు ఒకటి. సంవత్సరం పాలన.. విజయోత్సవాలు అని చెప్పి పైసలు బర్బాది చేస్తున్నది రేవంత్ ప్రభుత్వం. రుణమాఫీ అయిపోయింది చేశానని అంటున్నడు. మా ఇద్దరు నేతలు వచ్చి ఓ కాగితం ఇచ్చి వెళ్లారు. ఘట్కేసర్ ఫార్మర్స్ సర్వీస్ కో ఆపరేటివ్ సొసైటీ. మచ్చుకు ఎంత దొంగమాటలు.. రేవంత్‌రెడ్డి మాట్లాడే మాటలు.. కాంగ్రెస్ మాటలు అని చెప్పడానికి ఒకటి శాంపిల్‌గా ఒకటి చెబుతున్న. ఘట్కేర్ రైతుల కో ఆపరేటివ్ సొసైటీ.. ఇందులో 1189 మంది రైతులు ఉన్నరు. అందరికీ రూ.2లక్షల కంటే తక్కువనే లోన్లు ఉన్నయ్. మొత్తం చిట్టా ఉన్నది. వాళ్లకు కావాల్సిన రుణమాఫీ తిప్పితిప్పి కొడితే.. రూ.18.98లక్షలు. రేవంత్‌రెడ్డి మొత్తం అయ్యింది అంటున్నడు. ఇందులో ఎంత మందికి రుణమాఫీ జరిగిందో తెలుసా?.. 1189 మంది రైతుల్లో ఒకరికీ రుణమాఫీ కాలేదు. గిట్లుంటది రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌తో పెట్టుకుంటే. ఆరు గ్యారంటీలు అటకెక్కినయ్’ అన్నారు.
‘ఈ సంవత్సర కాలంలో ఏంజరిగిందని ఆలోచిస్తే.. మూడు మాటలు చెప్పచ్చు. కేసీఆర్‌కు తిట్లు.. దేవుడిపై ఒట్లు.. హామీలకు మాత్రం తూట్లు. 420 హామీలకు తూట్లు. ఇది తప్పా పీకింది ఏమీ లేదు. రేవంత్‌రెడ్డి ఏం చేసిండయ్యా అంటే.. అదానీ కోసం, అల్లుడి కోసం.. అన్నదమ్ముళ్ల కోసం, బావమరిదికి అమృతం పంచేందుకు జోర్దార్ పని చేసిండు. వచ్చే సంవత్సరం అనుముల అన్నాదమ్ముళ్లు అదానీ దాటిపోయే స్థాయికి తెలంగాణ మాత్రం దోపిడీ చేస్తున్నరు. అందుకే మిమ్మల్ని కోరేదీ. సందర్భం ఏదైనా ఈ మోసగాళ్లను నమ్మడానికి వీల్లేదు. రాబోయే రోజుల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు కావచ్చు. జిల్లా పరిషత్ ఎన్నికలు కావొచ్చు.. మున్సిపల్ ఎన్నికలు కావొచ్చు.. ఆ తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికలు కావొచ్చు. అప్రమత్తంగా ఉందాం.. పార్టీని పునర్మించుకుందాం.. వచ్చే సంవత్సరం దివ్యంగా సభ్యత్వం నుంచి అన్ని కార్యక్రమాలు చేసుకుందాం. ఒక వైపు ప్రజలకు అండగా ఉంటూ.. ప్రజా పోరాటాల్లో కీలకపాత్ర పోషిస్తూ.. మరో వైపు పార్టీని కూడా ముందుకు తీసుకెళ్దాం’ అన్నారు. మేడ్చల్‌లో బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించిన మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రాజు, సహకరించిన కేపీ వివేక్, పెద్దలందరికీ నమస్కారాలు. జై తెలంగాణ! అంటూ ముగించారు.