KTR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హైడ్రా వల్ల రోడ్డు మీద పడ్డ పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మేం కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లలో ఇంకా 40 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంచేవి ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
చెరువుల పక్కన, మురికి కాలువల పక్కన దోమలు కుట్టంగా, ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసి కూడా దిక్కులేక బతుకుతెరువు కోసం వచ్చి ఒకరేకో రెండు రేకులో వేసుకొని పేదలు అక్కడ బతికే ప్రయత్నం చేస్తారు. కానీ కావాలని హైదరాబాద్‌ను ఆగం చేయాలని ఎవరూ చేయరు కదా..? పేదవాళ్లు తెలిసో తెలియక కట్టుకుంటారు, మానవత్వం ఉన్న గవర్నమెంట్ వారికి నచ్చజెప్పి నోటిసు ఇచ్చి తప్పు జరిగితే జరిగింది అని వారిని ఒప్పించి, మెప్పించి వేరే చోట ఇల్లు ఇస్తా అని చెప్పి వారిని తరలించాలి. కానీ నీతి రీతి లేనట్టు ప్రవర్తించొద్దని రేవంత్ సర్కార్‌కు కేటీఆర్ చురకలంటించారు.
ముఖ్యమంత్రి నీకు చిత్తశుద్ది ఉంటే ఇవాళ రోడ్డు మీద పడ్డ పేదలు ఎవరైతే ఉన్నారో.. వారికి 40 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. మేం కట్టిన ఇండ్లు.. బంగారు పల్లెంలో పెట్టి నీకు అప్పజెప్పినం. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పేదవారికి ఆ ఇండ్లు ఇవ్వు. చట్టాన్ని ఫాలో అవ్వండి. అనుముల తిరుపతి రెడ్డికి ఒక నీతి.. మిగతా వారికి ఒక నీతి ఉంటుందా..? చట్టం కొంత మందికే ఎట్ల చుట్టం అయితది. హైడ్రా బాధితుల పట్ల బీఆర్ఎస్ పార్టీ ఒక సమావేశం నిర్వహిస్తుంది. వారికి ఏ రకంగా అండగా ఉండాలో కేసీఆర్ సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకో.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR | హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డి గుండెల్లో దడ.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు