KTR | హైదరాబాద్ : ఈ 17 నెలల కాలంలో తెలంగాణ ఆస్తులు తగ్గుతున్నయ్ ఎట్ల..? అనుముల కుటుంబం ఆస్తులు పెరుగుతున్నయ్ ఎట్ల..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రం దివాళా తీసింది అంటున్నవ్.. మరి నీ కుటుంబం ఆస్తులు ఎట్ల పెరుగుతున్నాయని కేటీఆర్ అడిగారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఆరు నెలల్లోపే అనుముల జగదీశ్వర్ రెడ్డి స్వచ్ఛ బయో పేరిట వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతా అని ఒప్పందం కుదుర్చుకుంటాడు. మీ అల్లుడు కొన్ని వేల కోట్లతో ఫార్మా కంపెనీ పెడుతా అని లగచర్లకు వస్తడు.. నువ్వేమో రైతు భూముల గుంజుకుంటవ్. మీ వియ్యంకుడి కంపెనీ అప్పుల్లో ఉండే.. అధికారంలోకి రాగానే అప్పులన్నీ కేంద్రం దయతో రైట్ ఆఫ్ అయిపోయాయి. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ మూడింతలు పెరిగింది. పెద్దమ్మ గుడి దాకా వచ్చిందట. వెల్దండ నుంచి ఫోర్త్ సిటీ వరకు 2 వేల ఎకరాలు కొన్నాడట. పది లక్షలు కూడా పెట్టుబడి లేని నీ బామ్మర్ది సృజన్ రెడ్డి 1137 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది. ఇలా అల్లుడి, బామ్మర్ది, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి ఆస్తులు పెరుగుతయ్.. నీ వియ్యంకుడి అప్పులు రైట్ ఆఫ్ అవుతాయి. కానీ రాష్ట్రం మాత్రం సంకనాకి పోతది. దివాళా అయిపోతది. ఎట్ల అయితుంది మరి. అందుకే ఈ సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్పండి. తెలంగాణ ఆస్తులు తగ్గుతున్నయ్ ఎట్ల..? అనుముల కుటుంబం ఆస్తులు పెరుగుతున్నయ్ ఎట్ల..? కచ్చితంగా చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ అప్పులు చేసి కాళేశ్వరం కట్టి వరిధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ చేశాడు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్‌ను 90 శాతం పూర్తి చేశాడు. మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చాడు. లక్ష కోట్లు పెట్టి విద్యుత్ లోటును అధిగమించి 24 గంటల విద్యుత్ ఇచ్చాడు. రైతుబంధు కింద 73 వేల కోట్ల ఇచ్చాడు. రైతుల 29 వేల కోట్ల అప్పు తీర్చిండు. హైదరాబాద్‌లో 36 ఫ్లై ఓవర్లు కట్టిండు. మెట్రో మొదటి దశ పూర్తి చేసిండు. సచివాలయం కట్టిండు. 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం పెట్టిండు. 32 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు పెట్టిండు. 1022 గురుకులాలు స్థాపించాడు. మరి నువ్వు పీకింది ఏంది..? అందాల పోటీలు రివ్యూ చేసే కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కేసీఆరే కట్టిండు అని కేటీఆర్ తెలిపారు.