KTR | కరీంనగర్ : మానవ బాంబులు ఎక్కడో లేరు.. రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఖమ్మం, నల్లగొండ మానవ బాంబులే రేవంత్‌ను ఖతం చేస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నిన్న గాక మొన్న మోదీ తెలంగాణకు వచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు మరోచోట పర్యటించి, ఒకట్రెండు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు. ఆ సందర్భంగా రేవంత్ మాట్లాడిన మాటలు, నిన్న కూడా పాలమూరులో మాట్లాడిన మాటలు వినే ఉంటారు. మూడు నెలలుగా ఆయన మాటలు గమనిస్తూనే ఉన్నారు. ఆవేశంతో ఊగిపోతూ నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉండి ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు.
నేను జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నా. పిచ్చిపచ్చిగా మాట్లాడితే.. గొంతు కొస్తా.. కడుపు చింపుతా.. మీ పేగులు మెడల వేసుకొని తిరుగుతా.. మా ప్రభుత్వాన్ని ఏమన్న జేస్తే మానవ బాంబులైతాం అని రేవంత్ అంటున్నారు. ఆయన మాటలు వింటుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. జేబుల్లో కత్తెర్లు పెట్టుకుని.. జేబు దొంగలు తిరుగుతరు. కానీ ఆయన జేబుల కత్తెర్లు పెట్టుకుని తిరగడం ఏంటో అర్థం కావడం లేదు. అలాంటోడు మన ముఖ్యమంత్రి అని కేటీఆర్ విమర్శించారు.
గతంలోనూ సెక్రటేరియట్లో మాట్లాడుతూ.. ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చాను అని రేవంత్ అన్నారు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు. ఈ లంకె బిందెల కథ, జేబుల కత్తెర్ల కథ అర్థం కావడం లేదు. నీ పక్కనే నల్లగొండ బాంబు, ఖమ్మం మానవ బాంబులు ఉన్నాయి. వాళ్లే నిన్ను ఖతం చేస్తారు. మేం ఏం చేయం. నీవు ఐదేండ్లు ఉండాలి.. నీవు ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రజలకు కూడా తెలియాలి ఎవరు గాడిదనో.. ఎవరు గుర్రమో.. రేవంత్ పాలన చూసిన తర్వాతనే మన నాయకుడి(కేసీఆర్) గొప్పతనం, ఆ విలువ ఏందో తెలుస్తది. బీపీ పెంచుకుని ఆగమాగం కాకు.. బీపీ గోలి వేసుకుని హాయిగా కూర్చో అని రేవంత్‌కు సూచించారు. నీకు ప్రమాదం కాంగ్రెస్ నాయకులతోనే. హామీలు అమలు చేయకపోతే వెంబడపడుతాం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు.