KTR | అచ్చంపేట : సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నల్లమల పులి అని చెప్పుకునేటోడు పిల్లిలా ఇంట్లో కూర్చోవాలా..? ఆల్మట్టి వద్దకు వెళ్లి గర్జించాల్నా..? అని కేటీఆర్ నిలదీశారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ జనగర్జన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉంటది.. కృష్ణా మీద ఆల్మట్టి డ్యాం ఉంటది. అప్పుడున్న ఏపీ ప్రభుత్వం.. ఈ ఆల్మట్టి డ్యాం కడితే తెలంగాణకు, ఏపీకి నీళ్లు రావని పోరాటం చేసింది. అయితే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఒక నిర్ణయం తీసుకుంది. 519 మీటర్ల మీద ఉన్న ఆల్మట్టిని మరో 5 మీటర్లు పెంచుతాం.. 18 ఫీట్లు ఎత్తుకు పెంచుతాం అని కర్ణాటక నిర్ణయించింది. రూ. 70 వేల కోట్లు ఖర్చు పెట్టి కిందకు చుక్క నీరు రాకుండా ప్రయత్నిస్తుంది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం. నల్లమల్ల పులి అని చెప్పుకునే రేవంత్… 18 ఫీట్లు డ్యాం ఎత్తు పెంచి పాలమూరుకు చుక్క నీరు రాకుండా చేస్తే నల్లమల్ల పులి అనేటోడు పిల్లిలా ఇంట్లో కూర్చోవాలా….? అక్కడకు వెళ్లి గర్జించాల్నా..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు.
నిజమైన పులి ఎలా ఉంటుందంటే.. నడిగడ్డకు నీళ్లు వస్తలేవని మా నీళ్లు మాకు రావాలని.. చెప్పి ఆర్డీఎస్ వరకు కేసీఆర్ పాదయాత్ర చేశారు. రాయలసీమ ఎమ్మెల్యే ఒక మాట అన్నాడు.. అదేంటంటే కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నడిగడ్డకు నీళ్లు రావాలని చెప్పి.. ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు.. కేసీఆర్ బ్లాక్ మెయిల్‌కు తలొగ్గి తూములు కిందకు దించితే వాటిని బాంబులతో బద్దలు కొడుతామని చెప్పిండు.. నిజమైన పులి కేసీఆర్ తక్షణమే స్పందించి.. ఆర్డీఎస్ తూముల వద్దకు అడుగు పెడితే.. అక్కడే ఉన్న సుంకేశుల బరాజ్‌ను వెయ్యి బాంబులతో తూనతునకలు చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. మరి నల్లమల్ల పులికి ఆ దమ్ము లేదా..? ఆ తెగువ లేదా..? పాలమూరు ఎండిపోయే పరిస్థితి వస్తే, నల్లగొండకు చుక్క నీరు రాని పరిస్థితి వస్తే.. మనకు కేఎల్ఐ లిఫ్ట్ ఎక్కడిది.. పాలమూరు ఎత్తిపోతల ఎక్కడిది.. శ్రీశైలంలోకి కృష్ణా రాకపోతే పైకి నీళ్లు తెచ్చుకునే అవకాశం ఎక్కడిది అని ఆలోచించాలని కోరుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆల్మట్టి ఎత్తుపై రాహుల్ గాంధీ, రేవంత్ మాట్లాడారు. కానీ తిరిగి కొట్లాడేది మాట్లాడేది తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక్క కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ దండుగా ఈ అచ్చంపేట గడ్డ మీద నుంచి అడుగుతున్నాం.. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఆల్మట్టిని ఆపే దమ్ముందా.. లేదంటే ఈ గులాబీ దండు బయల్దేరి ఆల్మట్టిని అడ్డుకోవాలా..? నీ ప్రభుత్వానికి దమ్ము తెగింపు ఉంటే రాహుల్ వద్దకు కర్ణాటక సీఎంను పిలిపించి.. ఆల్మట్టి ఎత్తును విరమించుకోవాలని డిమాండ్ చేయ్.. దాన్ని వెంటనే ఆపేయ్. ఆ దమ్ము నల్లమల పులికి ఉందా.. అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు.