Minister KTR | కల్వకుర్తి/ఆమనగల్లు, నవంబర్ 5: ఢిల్లీ దొరలను నమ్మితే తెలంగాణ భవిష్యత్ అంధకారమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కే తారక రామారావు హెచ్చరించారు. తెలంగాణను నాటి నుంచి నేటికీ నట్టేట ముంచింది, ముంచుతున్నదని కాంగ్రెస్వారేనన్న వాస్తవాన్ని ఇక్కడి బిడ్డలు మరువొద్దని సూచించారు. ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నాయని చెప్పారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు మున్సిపాలిటీలో ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ మాట్లాడారు. మొదటి నుంచి తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేస్తూ వస్తున్నదని చెప్పారు. 1956లో తెలంగాణను ఆంధ్రాలో విలీ నం చేసింది రాహుల్ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ, 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కు పాదాలతో తొక్కి 369 మందిని పొట్టన బెట్టుకున్నది రాహుల్ నాయినమ్మ ఇందిరమ్మ అని గుర్తు చేశారు.
1971లో 14 ఎంపీ సీట్లను తెలంగాణ జన సమితి గెల్చుకుంటే వారిని కాంగ్రెస్‌లో కలుపుకొని తెలంగాణ ఆకాంక్షలను వమ్ముచేసింది కాంగ్రెస్ పార్టీ కాదా.. అంటూ ప్రశ్నించారు. 2004 నుంచి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బిడ్డలు ప్రాణాత్యాగాలు చేస్తున్న సమయంలో ఢిల్లీలో అధికారంలో ఉన్నది ఈ దొరలే కదా! అని నిలదీశారు. కేసీఆర్ ప్రాణాలకు తెగించి సాగించిన ఉద్యమానికి తలవంచిన ఢిల్లీ దొరలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు దొరల తెలంగాణ అంటూ మాట్లాడటాన్ని ప్రజలు సహించబోరని కేటీఆర్ హెచ్చరించారు.
డిసెంబర్ 3న ఫలితాలు వస్తాయని, ఆ ఫలితాల్లో ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకొని పాలన సాగించిన కేసీఆర్ సర్కారు వస్తుందో.. ఢిల్లీ దొరల సర్కా రు వస్తుందో చూద్దామని రాహుల్‌కు సవాల్ విసిరారు. బక్క పలచని కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రె స్ నేతలకు దమ్ములేక బయట రాష్ర్టాల నుంచి నాయకులను అరువు తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సిం హం సింగిల్‌గా వస్తుంది. అని కేటీఆర్ అనగానే.. సభికు లు ‘పందులు గుంపులుగా వస్తాయని’ నినాదాలు చేశా రు.
అస్త్ర సన్యాసం చేసిన బీజేపీ
ఎన్నికలకు ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అస్త్ర సన్యాసం చేశారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రం నుంచి బీజేపీ తట్టా బుట్టా సర్దుకుంటుందని జోస్యం చెప్పారు. ఈ మాత్రం దానికి ఢిల్లీ నుంచి ప్రధాని, హోంమంత్రి, 15 రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు రాష్ర్టానికి దండయాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎంతమంది షేర్ఖాన్లు, తీస్మార్ఖాన్లు వచ్చినా.. తెలంగాణలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని తట్టుకోలేరని హెచ్చరించారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ డబ్బు సంచులతో వచ్చిన ప్యారాచూట్ నాయకులకు టికెట్లు ఇచ్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఒక విధానం లేని పార్టీ అని ఎద్దేవా చేశారు. డబ్బు సంచులతో వస్తున్న కాంగ్రెస్ నాయకులను నమ్మవద్దని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, జెడ్పీటీసీ అనురాధ తదితరులు పాల్గొన్నారు.
కిడ్డీబ్యాంక్లోనే 12 వేలను కేటీఆర్‌కు అందించిన చిన్నారి
ఆమనగల్లు సభకు వచ్చిన ఓ చిన్నారి తాను కిడ్డీబ్యాంక్‌లో దాచుకున్న 12 వేల రూపాయలను మంత్రి కేటీఆర్‌కు అందజేసింది. నామినేషన్ ఖర్చులకు ఈ డబ్బును వినియోగించాలని కోరింది. చిన్నారి అభిమానానికి మంత్రి కేటీఆర్ ఉప్పొంగి పోయారు. చిన్నారి తండ్రి ఎండలి రఘు కూడా మంత్రికి గదను బహూకరించారు.